శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
వారణాసి - విశాలాక్షి
భారతీయులందరూ ఎంతోపవిత్రంగా భావించే వారణాసి క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని గంగాతీరంలో వుంది. శక్తిపీఠంతోపాటు యిది జ్యోతిర్లింగ క్షేత్రంకూడా. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథ జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు. కాగా కాశీ క్షేత్రంలో సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) పడిందట. ఈ క్షేత్రానికి యిరువైపులా ‘వరుణ’, ‘అసి’ అనే రెండు నదులు ప్రవహిస్తుండటం వలన ఈ క్షేత్రం వారణాసిగా పేరొందింది.పరమేశుని దివ్య జ్యోతిర్లింగం యిక్కడ ప్రకాశమానం అవుతోంది కనుక, ఈ క్షేత్రం కాశీగా ప్రసిద్ధమైంది. ‘కాశి’ అంటే కాంతి, వెలుగు, తేజస్సు, ప్రకాశము అనే అర్థాలున్నాయి. కాశీ క్షేత్రంలో విశాలాక్షీ దేవి కొలువుతీరటంవెనుక ఒక కథ ఎంతగానో ప్రచారంలో వుంది.
పూర్వం ఒకప్పుడు భూలోకమంతా చెడుపాలకులతో నిండిపోయి ధర్మహాని కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న దివోదాసు అనే క్షత్రియుణ్ని పిలిచి తపస్సు మాని కాశీ రాజ్యాన్ని పాలించమన్నాడు. అందుకు దివోదాసు అంగీకరిస్తూనే, దేవతలందరూ భూలోకాన్ని వదలి వెళితేనే తాను కాశీని పాలించగలనన్నాడు. దాంతో దేవతలందరితోపాటు పరమేశుడు కూడా కాశీని వదలి వెళ్ళాడు. దివోదాసు కాశీని పాలించసాగాడు. కానీ పరమేశుడు కాశీ వియోగాన్ని భరించలేకపోయాడు.తండ్రి బాధను చూడలేని వినాయకుడు డుంఢి విఘ్నేశ్వరునిగా కాశీకి చేరాడు. దివోదాసుకు భక్తి, వైరాగ్యాలు కలిగేటట్లు చేసాడు. దాంతో దివోదాసు స్వయంగా పరమేశుని కాశీకి ఆహ్వానించాడు. శివుడు పరమానందంతో కాశీక్షేత్రంలో తిరిగి ప్రవేశించాడు.
ఈ సందర్భంలో పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలై తన కళ్ళను పెద్దవిచేసి, విశాలమైన అక్షాలతో పరమేశుని చూసి, ఈ క్షేత్రంలోనే విశాలాక్షిగా కొలువుదీరింది.కాశిలో విశ్వేశ్వర ఆలయానికి రెండు వీధుల తర్వాత దక్షిణంగా విశాలాక్షి ఆలయం వుంది. అయితే చూసేందుకు ఈ ఆలయం ఎంతో సాధారణ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. అయితే ఆలయంలోని అమ్మవారు నయనా నందకరంగా దర్శనమిస్తారు.