శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఉజ్జయిని - మహంకాళి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వెలసిన అమ్మవారికి మహాకాళి అని పేరు. అక్కడ సతీదేవి యొక్క పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఇక్కడ కొలువైన పరమేశుని మహాకాళేశ్వరుడని పిలుస్తారు.

మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఉజ్జయిని కూడా ఒకటి. తక్కినవి అయోధ్య, మధుర, కాశి, కంచి, పురీ, ద్వారక. ఈ క్షేత్ర ప్రాశస్త్యం అగ్ని, . స్కాంద, శివ, భవిష్య పురాణాలలోనూ, భారతీయ ఇతిహాసాలలోనూ, మరెన్నో ప్రాచీన గ్రంథాలలోనూ ఎంతగానో స్తుతించబడింది.

మన పురాణాలలోనూ, ప్రాచీన శాస్త్రాలలోనూ ఈ ఉజ్జయిని అవంతి, అవంతిక, విశాల, కనకశృంగ, కుముద్వతీ, కుశస్థలి, అమరావతి అనే పేర్లతో పిలువబడింది. ఈ ఉజ్జయినిలోనే సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు విద్య నభ్యసించారు. భట్టి విక్రమార్క కథలకు ఆధారభూతమైన భేతాళవృక్షం ఉజ్జయినిలోనే వుండేదని చెబుతారు.

కాగా, యిక్కడి స్థలపురాణం ప్రకారం... పూర్వం అంథకాసురుడనే రాక్షసుడు లోకాలన్నింటినీ బాధిస్తూ, ప్రజలను హింసించసాగాడు. దేవతల కోరిక మేరకు. ఆ రాక్షసుని చంపేందుకై పరమేశుడు మహాకాళేశ్వర రూపంతో ఆ రాక్షసునితో యుద్ధానికి తలబడ్డాడు.

అయితే బ్రహ్మదేవుని వరప్రభావంతో అంథకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొరాసాగారు. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారాన్ని దాల్చి యుద్ధభూమిలో నిలచి, తన పొడవైన నాలుకను చాచి, అంథకాసురుడి రక్తం ఒక బొట్టుకూడా నేల మీద చింద కుండా తాగేసి, పరమేశునితో అంథకాసురుని సంహరింపజేసింది. ఈ సందర్భములోనే యిక్కడ మహాకాళేశ్వరునితో పాటు, మహాకాళికూడా కొలువుతీరింది.