శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

నాగేశ్వర జ్యోతిర్లింగం

గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ద్వారకకు సుమారు 22 కి.మీ.ల దూరంలో, అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో నాగనాథ్ క్షేత్రం వుంది. గోమతీనది ఈ క్షేత్రం వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. పరమేశుడు ఈ క్షేత్రంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు.

శివపురాణంలో కోటి రుద్ర సంహిత 29వ అధ్యాయం లో ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం చెప్పబడింది. ఈ కథ ప్రకారంగా, పూర్వం ఈ ప్రాంతంలో దారుక-దారుకుడు అనే రాక్షస దంపతులుండేవారు. ఈ రాక్షసులు తమ బలంతో అందరినీ హింసిస్తూ, ఋషులు చేసే యజ్ఞ, యాగాదులను ధ్వంసం చేసేవారు. అప్పుడు ఋషులు వెళ్ళి ఈ రాక్షసుల దురాగతాలను ఔర్వమహర్షికి వివరించారు. వారి అకృత్యాలను నివారించడానికై “భూమిపై నివసించే నిరపరాధులైన జనాన్ని హింసిస్తే” మరుక్షణమే ఆ రాక్షసులు మరణించే విధంగా శపించాడు ఔర్వ మహర్షి.

ఔర్వ మహర్షి శాపాన్ని తెలుసుకున్న దారుకుడు, తాను నివాసముంటున్న వనాన్ని పైకెత్తి, సముద్రం మధ్యలో స్థాపించాడు. ఔర్వ మహర్షి తన శాపంలో “భూమిపై నివసించే జనాన్ని” అని అన్నందు వలన, ఆ రాక్షసులు భూమిపై ఉండే జనాల జోలికి పోకుండా, సముద్రంపై ప్రయాణించే వారిని హింసించి, సంహరించ సాగారు.

ఇది యిలా వుండగా, కొంతమంది వర్తకులు వాణిజ్యం కోసం, యితర దేశాలకు వెళ్ళేందుకై నావలలో సముద్ర యానం చేయసాగారు. అప్పుడు దారుకుడు ఆ వ్యాపారు లందరినీ బంధించి, తన చెరసాలలో వేశాడు. ఈ వర్తకులలో సుప్రియుడనే వర్తక ప్రముఖుడున్నాడు. శివభక్తుడైన సుప్రియుడు చెరసాలలోనే శివారాధ నను కొనసాగించాడు. అంతేకాకుండా అందరిచేత కూడా శివపూజలను చేయించాడు. ఇది నచ్చని దారుకుడు సుప్రియుని చిత్రవధ చేసి చంపమని తన సేనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడ పరమేశుడు ప్రత్యక్షమై తన పాశుపతాస్త్రంతో దారుకుని, అతని సేననంతటినీ హతమార్చి, ఆ వనమంతా శివభక్తులకు నివాసంగా చేసి, తాను అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలసాడు.

మరో కథ ప్రకారం ఈ దారుకావనంలో పరమశివుడు దిగంబరంగా భిక్షాటనకై సంచారం చేస్తూ, మునిపత్నుల చేత ఆకర్షింపబడ్డాడు. అది గమనించిన మునులు శివుణ్ణి మట్టు పెట్టాలని సర్పశక్తిని ప్రయోగించారు. అప్పుడు శివుడు ఆ సర్పశక్తిని నాగాభరణంగా ధరించి, నాగేశ్వరుడై యిక్కడ వెలశాడని చెప్పబడుతోంది.