శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీశైలం - భ్రమరాంబ

శ్రీశైల మహాక్షేత్రంలో సతీదేవి యొక్క మెడభాగం పడినట్లుగా చెప్ప బడుతోంది. ఇక్కడి అమ్మవారికి భ్రమరాంబాదేవియని పేరు.

శ్రీశైల మహాక్షేత్రం శక్తిపీఠమే కాకుండా జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఈ క్షేత్రనాథుడైన మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. మరెక్కడా లేనివిధంగా జ్యోతిర్లింగం - మహాశక్తి ఒకే ఆలయ ప్రాంగణంలో వెలసి వుండడం ఈ క్షేత్రం యొక్క విశేషం. అందుకే ఈ క్షేత్రం ప్రఖ్యాత శైవక్షేత్రంగానే కాకుండా శక్తిస్థలంగా కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.

శ్రీశైల మహాక్షేత్రం ఎంతో మహిమాన్వితమైంది. అష్టాదశ పురాణాలలోని తొమ్మిది పురాణాలు, మరెన్నో తెలుగు, సంస్కృత, మరాఠీ గ్రంథాలు శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యాన్ని ఎంతగానో కొనియాడాయి. ఈ క్షేత్రం యొక్క సమస్త విషయాలను స్కాందపురాణంలోని శ్రీశైలఖండం ఎంతో వివరంగా చెబుతోంది.

మన పురాణాలలో ఈ క్షేత్రం భూమండలానికి నాభి స్థానంగా చెప్ప బడింది. అందుకే మనం వివిధ వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో “శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే..., శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే…” అంటూ మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని అంటే మనం శ్రీశైలక్షేత్రానికి ఏ దిక్కున వున్నామనేదాన్ని వివరంగా చెప్పుకుంటాం.

యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల క్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీ రాముడు, ద్వాపరంలో పాండవులు దర్శించారని పురాణాలలో చెప్పబడింది. కలియుగంలో దత్తాత్రేయులు, శంకరభగవత్పాదులు, మంత్రాలయ రాఘవేంద్రయతీంద్రులు, ఇంకా శివశరణులైన అల్లమ ప్రభువు, అక్కమహా దేవి, సిద్ధరామప్ప ఈ క్షేత్రంలోని దేవతలను సేవించారు. ఇక్కడి అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించిన కథ స్కాందపురాణంలో చెప్పబడింది.

కృతయుగంలో అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సుచేసి, తనకు స్త్రీచేతగాని, పురుషుడి చేతగాని, నపుంసకుని చేతగాని, మరే ఆయుధం వలన గాని, రెండు కాళ్ళ జీవి వలనగాని, నాలుగుకాళ్ళ జంతువు వలనగాని మరణంలేని వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో లోకాన్నింటిని బాధించ సాగాడు అరుణుడు. దాంతో దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకుని, ఆ రాక్షసుని ఆగడాలను మొరపెట్టుకున్నారు. అప్పుడు పరాశక్తి వారికి అభయాన్నిచ్చి, భ్రమర రూపాన్ని (తుమ్మెద రూపాన్ని) ధరించి అరుణాసురుని సంహరించి, శ్రీశైల క్షేత్రంలో భ్రామరీ శక్తిగా కొలువు తీరింది.

ఇక్కడ విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి వెనుక కొంత ఎత్తులో అమ్మవారి ఆలయం నిర్మించబడింది. అమ్మవారి ఆలయాన్ని చేరేందుకు స్వామివారి గర్భాలయ వెనుకభాగం నుండి విశాలమైన మెట్లు వుండేవి.

ఆలయంలోని అమ్మవారి మూలమూర్తి ఉగ్రరూపిణి అయినప్పటికీ, అలంకార రూపంలో సౌమ్యమూర్తిగా దర్శనమిస్తుంది. రూపంలో ఉగ్రస్వరూ పిణి అయినా, ఈ తల్లిని మన పురాణాలు దయా స్వరూపిణిగా పేర్కొ న్నాయి. కాగా ఆదిశంకరులవారు ఈ క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ఒక ప్రక్రియనుచేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించినట్లుగా చెప్పబడింది. ఇక్కడి అమ్మవారి మూలరూపం మహిషాసురమర్దిని రూపంలో వుంది. కానీ అలంకార రూపంలో మనం అమ్మవారి ముఖాన్ని మాత్రమే దర్శించ గలుగుతాం. ఎనిమిది చేతులుగల ఈ దేవి ఎడమ పాదంతో మహిషాన్ని గట్టిగా తొక్కిపట్టి, దాని ముఖాన్ని ఎడమ హస్తంతో పైకెత్తి పట్టుకుని, కుడి హస్తంలో శూలాన్ని ధరించి, మహిషాన్ని వధించినట్లుగా చూపబడింది.

అమ్మవారి తక్కిన చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా బాకు, గద, ఖడ్గము... అట్లే ఎడమ వైపున విల్లు, డాలు, పరిఘ వుంటాయి. అమ్మవారి కుడి భుజంలో అంబులపొది కూడా వుంటుంది. అమ్మవారి ప్రభావళికి కుడివైపున సింహం మలచబడివుంది.

ఈ అమ్మవారి ఆలయంలో ఎంతో విశేషం వుంది. ఇక్కడి గర్భాలయ వెనుక గోడపై ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. 1984-85 వరకు ఈ రంధ్రం దగ్గర చెవిని పెడితే తుమ్మెదనాదం ఎంతో స్పష్టంగా వినిపిస్తుండేది. ఆకాశవాణి కేంద్రం వారు ఈ నాదాన్ని రికార్డు కూడా చేశారు.