శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
విశ్వనాథ జ్యోతిర్లింగం
భారతీయులందరూ పరమ పవిత్రంగా భావించే వారణాసి క్షేత్రం, ఉత్తరప్రదేశ్ లోని గంగాతీరంలో వుంది. ఈ పావన క్షేత్రానికి యిరువైపులా ‘వరుణ’ - ‘అసి’ అనే రెండు నదులు ప్రవహిస్తుండడం వలన ఈ క్షేత్రం వారణాసిగా పేరొందింది. పరమేశుని దివ్య జ్యోతిర్లింగం యిక్కడ ప్రకాశమానం అవుతోంది కనుక, ఈ క్షేత్రం కాశీగా ప్రసిద్ధమైంది. “కాశి” అంటే కాంతి, వెలుగు, తేజస్సు, ప్రకాశము అనే అర్థాలున్నాయి. ఇక్కడ పరమశివుడు విశ్వనాథునిగా కొలువుదీరాడు. వారణాసి మహా శక్తిపీఠం కూడా. పద్దెనిమిది మహా శక్తులలో ఒకటిగా చెప్పబడే విశాలాక్షీదేవి ఈ క్షేత్రంలోనే వెలసింది. మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఒకటైన కాశీక్షేత్రానికి “ముక్తిభూమి” అనే పేరుంది. ఈ క్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పకుండా లభిస్తుందని చెప్పబడింది. ఇక్కడ మరణించిన వారికి విశ్వనాథుడు కుడి చెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడట. ప్రళయ కాలంలో కూడా ఈ క్షేత్రానికి ఎలాంటి విపత్తు రాదంటారు. ఆ సమయంలో పరమేశుడు ఈ క్షేత్రాన్ని తన త్రిశూలంమీద ధరిస్తాడట. స్థలపురాణం ప్రకారం పరమశివుడు విశ్వసృష్టి కోసం మొదటగా ప్రకృతి, పురుషులను సృష్టించాడు. ఈ పురుషుడు శ్రీమహావిష్ణువు స్వరూపమే. సృష్టికోసం తపస్సాచరించదలచిన ప్రకృతి, పురుషులు తమ తపస్సుకు అనువైన స్థానాన్ని చూపమని శివుణ్నికోరారు. అప్పుడు మరమేశుడు ఐదు క్రోసుల వైశాల్యంగల కాశీని నిర్మించాడు. ప్రకృతి, పురుషులలో పురుషుడైన నారాయణుడు యిక్కడ చాలాకాలం తపస్సు చేశాడు. ఈ విధంగా తపస్సు చేస్తున్న శ్రీహరిదేహం నుండి స్వేదబిందువులు జలధారలుగా ప్రవహించాయి. ఈ విచిత్రాన్ని చూసిన నారాయణుడు ఆశ్చర్యంతో తన శిరస్సును కంపించాడు. అప్పుడు అతని కుడిచెవి ఆభరణం జారిపడింది. అది పడిన ప్రదేశమే మణికర్ణికా తీర్థం. కాగా శ్రీమహావిష్ణువు స్వేదజలంలో మునిగిన ఆ భూఖండాన్ని తన శూలంతో గుచ్చి, ఎత్తి పట్టుకున్నాడు శివుడు. తరువాత శ్రీమహావిష్ణువు ఈ భూఖండంలోనే యోగనిద్రలో నిమగ్న మయ్యాడు. అప్పుడు ఆయన నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఈ బ్రహ్మ దేవుడే బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఈ బ్రహ్మాండంలో జీవులు బంధ విమోచనాన్ని పొందేందుకు వీలుగా అంతరిక్షంలో తాను త్రిశూలంతో గుచ్చి పెట్టిన భూఖండాన్ని పరమశివుడు శూలంనుండి తీసి, బ్రహ్మాండంలో కలిపాడు. ఈ విధంగా కలుప బడిన ప్రదేశమే కాశి. ఈ సందర్భంలో విష్ణువు, పరమేశుని ఎన్నో విధాలుగా స్తుతించగా, పరమేశుడు విశ్వనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు.