శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర)
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వరం చివరిది. ఇక్కడ వెలసిన స్వామికి ఘృష్ణేశ్వరుడని పేరు. ఈ ఘృష్ణేశ్వరస్వామి సంతాన కారకునిగా ప్రసిద్ధుడు. సంతానం లేని వారు ఈ స్వామిని సంతానం కొరకు సేవిస్తుంటారు. మహారాష్ట్రలోని ఔరంగబాదు నగరానికి ఈ ఘృష్ణేశ్వర క్షేత్రం 28 కి.మీ దూరంలోవుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరాగుహలు యిక్కడికి కేవలం 3 కి.మీ దూరంలో వున్నాయి. వాస్తవానికి ఈ క్షేత్రం యొక్క అసలు పేరు ఘృశ్మేశం. పూర్వం యిక్కడ ఘృశ్మ అనే భక్తురాలికి దర్శనమిచ్చి, ఆమె కోరిక మేరకు యిక్కడ కొలువైన శివుడు ఘృశ్మేశ్వరునిగా పిలవబడి, ఈ క్షేత్రం ఘృశ్మేశ్వరంగా పేరొందింది. కాలక్రమములో ఈ ఘృశ్మేశ్వరమే ఘృష్ణేశ్వరంగా మారింది. శివపురాణంలోని కోటిరుద్ర సంహిత 133వ అధ్యాయంలో ఈ క్షేత్రం యొక్క స్థలపురాణగాథ వివరించబడింది. ఈ కథ ప్రకారం - పూర్వం ఇక్కడి దేవగిరి పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుం డేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్నో తీర్థయాత్రలు చేసినా వారికి సంతానం కలుగలేదు. ఇదిలా వుండగా ఒక రోజున ఒక యతి వారింటికి భిక్షార్ధం వచ్చాడు. ఆ దంపతులు ఆ యతికి ఆతిథ్యాన్ని సమకూర్చారు. కానీ ఆ యతి వారికి సంతానం లేదన్న విషయాన్ని తెలుసుకొని, వారి భిక్షను నిరాకరించాడు. అప్పుడు సుదేహ, సుధర్మలు తమకు సంతానం కలిగే మార్గం చెప్పమంటూ ఆ యతి పాదాలపై పడి వేడుకున్నారు. దానికి ఆ యతి కాలాంతరంలో సుధర్మునికి కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. అయితే సుదేహకు తన బాల్యంలో జ్యోతిషులు తనకు సంతాన యోగంలేదని చెప్పినవిషయం గుర్తుకొస్తుంది. దాంతో తనవల్ల తన భర్తకు సంతానం కలుగదని భావించిన సుదేహ, తన చెల్లెలైన ఘృశ్మలను సుధర్మునికిచ్చి వివాహం జరిపించింది. కొంతకాలానికి ఘృశ్మలకు కుమారుడు జన్మించాడు. ఘృశ్మల గొప్ప శివభక్తురాలు. ఆమె ప్రతిరోజు 1001 పార్థివ శివలింగాలను అర్చించి, వాడిని చెరువులో నిమజ్జనం చేసేది. ఆ భక్తురాలు కేవలం శివాను గ్రహము వల్లనే తమకు కొడుకు పుట్టాడని విశ్వసించేది. ఘృశ్మలకొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్తవయస్సు రావడంతో అతనికి వివాహం జరిపించారు. కొడుకు, కోడలుతో సుధర్మ, ఘృశ్మలలు ఆనందంగా గడపసాగారు. దీన్ని చూసిన సుధర్ముని పెద్దభార్య సుదేహకు అసూయా ద్వేషాలు కలిగాయి. ఒక రోజు సుదేహ వేకువ జామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఘృశ్మల కొడుకు తలను నరికి, యింటికి దూరంలో వున్న చెరువులో వేసింది. జరిగిన దురాగతాన్ని తెలుసుకున్న ఘృశ్మల కోడలు ఎంతగానో రోదించింది. అప్పటికే శివలింగార్చనలో నిమగ్నమైవున్న ఘృశ్మల, ఆనాటితో తన కోటి శివ లింగార్చన పూర్తవుతుందని తనకు ఎప్పటికీ పుత్రశోకం వుండదని కోడలిని ఓదార్చి తాను అర్చించిన పార్థివ లింగాలలు నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్ళింది. అప్పుడు పరమశివుడు ఘృశ్మలకు సాక్షాత్కరించి ఆమె కొడుకును బ్రతికించాడు. తరువాత ఘృశ్మల కోరికమేరకు పరమశివుడు అక్కడ జ్యోతిర్లింగంగా వెలశాడు.