శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ప్రద్యుమ్నం - శృంఖలాదేవి

ప్రద్యుమ్న క్షేత్రం గురించి రెండు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో వున్నదని కొందరు చెబుతుండగా, పశ్చిమబెంగాల్ లో వుందని మరికొందరు పేర్కొంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోటకు దగ్గరలోవున్న సురేంద్రనగర్ లోని చోటిల్లామాతను అక్కడివారు శృంఖలాదేవిగా భావిస్తారు.

కానీ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని ‘పాండుపా’ గ్రామాన్ని ఎక్కువ మంది భక్తులు ప్రద్యుమ్నంగా విశ్వసిస్తున్నారు. ఈ పాండుపా గ్రామం కలకత్తా నగరానికి దాదాపు 80 కి.మీ దూరంలో వుంది. కాగా ఈ ప్రద్యుమ్నంలోని అమ్మవారికి శృంఖలాదేవి అని పేరు. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం పడిందని చెప్పబడింది. ఈ క్షేత్రంలోని అమ్మవారిని ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.

త్రేతాయుగంలో వంగదేశమును (ప్రస్తుత బెంగాల్ ప్రాంతం) రోమపాదుడు పాలించేవాడు. ఒకానొక సమయంలో వంగదేశంలో తీవ్రమైన కరవుకాటకాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో తపోబల సంపన్నుడైన ఋష్యశృంగుడు కాలుమోపిన ప్రదేశమంతా సస్యశ్యామలమై, క్షామమంతా తొలగిపోయేది. దాంతో రోమపాదుడు కూడా ఋష్యశృం గుణ్ణి వంగదేశానికి రప్పించాడు.

ఋష్యశృంగుడు పాదం మోపడంతో వంగదేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువుకాటకాలు తొలగి రాజ్యం సుభిక్షమైంది. ఆ సందర్భంలోనే ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఋష్యశృంగుడు ప్రతిష్ఠించడం వలన ఆ దేవి శృంగలాదేవిగా పిలువబడుతూ, కాలక్రమంలో శృంఖలాదేవిగా పిలువబడిందని స్థానిక గాథలవలన తెలుస్తోంది.

కాగా “శృంఖల” అంటే “సంకెళ్ళు” అనే అర్థంవుంది. ఈ దేవి సంకెళ్ళలాంటి భక్తుల సమస్యలను తొలగించి, వారి కష్టాలను కడతేర్చుతుందని, అందుకే ఈ దేవిని శృంఖలాదేవిగా పిలుస్తారని చెబుతారు.

ఈ అమ్మవారి నామానికి సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో వుంది. సాధారణంగా బాలింతలు నడుముకు గట్టిగా గుడ్డను కట్టుకుంటారు. దీనికే “బాలింత నడికట్టు” అని పేరు. ఈ నడికట్టునే “శృంఖల” అని అంటారు. బాలింత పురిటి బిడ్డను కంటికి రెప్పలా ఎలాచూసు కుంటుందో ఈ అమ్మవారు కూడా తన భక్తులను అలాగే చూసుకుంటుందని, అందుకే ఆదేవిని శృంఖలాదేవిగా పిలుస్తారని కూడా చెబుతారు.