శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

వైద్యనాథ (మహారాష్ట్ర)

జ్యోతిర్లింగాలలో అయిదవది అయిన వైద్యనాథ జ్యోతిర్లింగానికి సంబం ధించి “వైద్యనాథం చితాభుమౌ” అని, “ప్రజ్వల్యాం వైద్యనాథం చ” అని రెండు పాఠాంతరాలుండటం వలన ఈ జ్యోతిర్లింగ స్థాన విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

వైద్యనాథలింగం జార్ఖండ్ రాష్ట్రంలోని జసిధి రైల్వే స్టేషన్ సమీపంలోని “వైద్యనాథమ్”లో వుందని ఉత్తరభారతీయులు భావిస్తారు. కానీ దక్షిణభారతీయులు మరియు మహారాష్ట్రీయుల దృష్టిలో మహా రాష్ట్రలోని ఔరంగాబాదుకు 273 కి.మీ దూరంలో గల భీడు జిల్లాలోని పరలి క్షేత్రమే జ్యోతిర్లింగ క్షేత్రం.

ఈ జ్యోతిర్లింగాల స్థానవిషయంలో వేరువేరు అభిప్రాయాలున్నప్పటికీ, స్థలపురాణగాథ మాత్రం ఒకటిగానే ఉంది.

ఒకసారి రాక్షసరాజైన రావణాసురుడు కైలాసపర్వతం మీద శివుని దర్శనం కోసం గోరతపస్సు చేశాడు. ఆ తపస్సులో ఒకదాని తర్వాత మరొకటిగా తనశిరస్సులను ఖండించి శివునికి అర్పించసాగాడు. ఆ విధంగా రావణుడు తన తొమ్మిది తలలను శివునికి సమర్పించి, పదవ తలను కూడా సమర్పించేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని ప్రయత్నాన్ని విరమింపచేసి, రావణుని తొమ్మిది తలలు ఎప్పటిలాగా యథాస్థానంలో వుండేటట్లు అనుగ్రహించి, వరాన్ని కోరుకోమన్నాడు.

దానికి పరమేశుని శాశ్వతంగా తన లంకానగరంలో నివాసముండమని కోరాడు రావణుడు. దానికి వీలుపడదని చెప్పిన శివుడు, తనకు ప్రతీకగా తన ఆత్మలింగాన్నిచ్చి దానిని లంకానగరంలో ప్రతిష్టించమని చెప్పాడు. అంతే కాకుండా ఆత్మలింగం లంకానగరానికి చేరేలోపు భూమిమీద పెట్టకూడదని, ఒకవేళ ఎక్కడైనా నేలపై పెడితే, దానిని పెకిలించేందుకు ఎవ్వరికీ సాధ్యపడదని కూడా చెప్పాడు శివుడు. ఆత్మలింగాన్ని పొందిన రావణుడు లంకానగరానికి బయలుదేరాడు. ఆత్మలింగం లంకానగరం చేరితే తమకు కష్టాలు తప్పవని భావించిన దేవతలు ఆత్మలింగం లంకానగరానికి చేరకుండా చూడమని గణపతిని ప్రార్థించారు. దాంతో గోపబాలుని రూపంలో వినాయకుడు రావణుని వెంబడించాడు.

ఈ విషయం తెలియని రావణుడు మార్గమధ్యంలో సంధ్యావందనానికి సమయం కావడంతో, తన చేతిలోని ఆత్మలింగాన్ని గోపబాలుని చేతిలోవుంచి దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నేలపై పెట్టొద్దంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అయితే రావణాసురుడు సంధ్యావందనం ముగించి వచ్చేలోపే ఆత్మలింగం నేలపై పెట్టాడు గోపబాలుని రూపంలోవున్న వినాయకుడు.

అప్పుడు రావణుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంచుకైనా ఆ శివలింగం కదల్లేదు. ఆ ప్రయత్నంలో రావణుని శరీరం గాయాలతో రక్తసిక్తమయింది. చివరకు శివుడు ఆ ఆత్మలింగం కదలదని చెప్పి రావణుని గాయా లను మాన్పించి అక్కడే జ్యోతిర్లింగంగా వెలశాడు. రావణుని గాయాలను మాన్పించిన కారణంగానే ఇక్కడి స్వామికి వైద్యనాథుడనే పేరు స్థిరపడింది.