శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్)
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవది అయిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి సుమారుగా 65 కి.మీ దూరంలోవుంది. ఈ క్షేత్రంలో పరమశివుడు రెండు మూర్తులుగా వెలసిన ఒకే జ్యోతిర్లింగమవ్వడం విశేషం. స్వామిని ఓంకారేశ్వరుని గాను, అమరేశ్వరునిగానూ పిలుస్తారు. ఈ ప్రదేశంలో నర్మదానది రెండు పాయలుగా చీలి మధ్య ఒక ద్వీపం ఏర్పడింది. ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతమని పిలుస్తారు. రఘువంశానికి మూలపురుషుడైన మాంధాత చక్రవర్తి ఈ పర్వతంపై తపస్సుచేసిన కారణంగా ఇది మాంధాత పర్వతమైంది. ఈ పర్వతానికే శివపురి అనే పేరు కూడా ఉంది. కాగా నదినుండి ఒక పాయ ఈ పర్వతానికి ఉత్తరంవైపు ప్రవహించగా, మరోపాయ దక్షిణం వైపుకు ప్రవహిస్తుంది. ఈ మాంధాత పర్వతం మీదనే ఓంకారేశ్వరుని ఆలయం నెలకొనివుంది. ఇక నర్మదానదికి దక్షిణ తీరంలో ఓంకారేశ్వర ఆలయానికి కొద్దిదూరంలోనే అమరేశ్వర ఆలయంవుంది. నిజానికి మొట్టమొదట అమరేశ్వర జ్యోతిర్లింగమే వెలసిందని, తరువాత మాంధాత తపస్సుచేత అమరేశ్వరుని నుండే ఓంకారేశ్వరుడు ఆవిర్భవించాడని చెబుతారు. ఇక్కడ ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు వేరువేరుగా వున్నప్పటికీ రెండింటినీ ఒకే స్వరూపంగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర ఆలయం శిఖరంపై వున్నప్పటికీ అందులోని శివలింగం వింధ్య శిఖర భాగమే. వింధ్యుని కారణంగా ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని స్థలపురాణం చెబుతోంది. ఒకసారి నారదమహర్షి లోకసంచారం చేస్తూ పర్వతరాజైన వింధ్యుని వద్దకు వచ్చాడు. ఆ సందర్భంలో వింధ్యుడు పర్వతాలలో తన కన్నా అధికులెవ్వరూ లేరంటూ అహంభావంతో పలి కాడు. వింధ్యుని అహంకారాన్ని పోగొట్టేందుకు నారదుడు మేరుపర్వత శిఖరాలు దేవలోకాలవరకు వ్యాపించాయని, ఆ శిఖరాలపై దేవతలు సహితం నివసిస్తున్నారని, కాబట్టి వింధ్య పర్వతంకంటే మేరుపర్వతమే గొప్పదని పలికాడు. అప్పుడు వింధ్యుడు తాను మేరుపర్వతం కంటే అధికుడవ్వాలనే కోరికతో ఓంకార క్షేత్రంలో శివునికోసం తపస్సుచేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించాడు. అప్పుడు శివుడు తనపై ఎప్పుడూ కొలువుతీరి వుండేవిధంగా వింధ్యుడు వరాన్ని పొందాడు. శివుడు వింధ్యుని కోరిన వరాన్ని ప్రసాదించి ఆ కొండపై అమరేశ్వరునిగా వెలిశాడు.