శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
క్రౌంచపట్టణం (మైసూరు) - చాముండి
మన పురాణాలలో క్రౌంచపట్టణంగా పేర్కొనబడిన ప్రదేశమే ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలోని మైసూరు. పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షసరాజు పరిపాలించే వాడు, అందుకే ఈ ప్రాంతం “మహిసూరు”గా పిలువబడేది. ‘మహిసూరే’ కాలక్రమంలో “మైసూరు”గా మారిందని చెబుతారు.
ఈ క్షేత్రంలో అమ్మవారు చాముండేశ్వరిగా కొలువుతీరింది. ఇక్కడ సతీదేవి తలవెంట్రుకలు పడినట్లుగా చెప్పబడింది. కాగా ఆదిపరాశక్తి మహిషాసురుని అంతమొందించి ఇక్కడ చాముండేశ్వరిగా వెలసిందని స్థలపురాణం చెబుతోంది.
పూర్వం మహిషాసురుడనే రాక్షసురుడు ఘోరతపస్సచేసి, దేవ, దానవ, మానవులలో ఏ మగవాడు చంపలేనట్లుగా బ్రహ్మదేవుని నుండి వరాన్నిపొందాడు. ఆ వరగర్వంతో మహిషాసురుడు సర్వలోకాలపై దండెత్తి, లోకాలన్నింటినీ ఆక్రమించుకొని, అందరినీ భాదించసాగాడు. చివరకు ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవతలంతా శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయాన్ని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవరం కారణంగా మహిషాసురుని ఏ మగవాడు చంపలేడని, కాబట్టి అతనిని చంపేందుకు స్త్రీకి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాడు విష్ణువు.
అప్పుడు దేవతలంతా మహిషాసురుని వధించమని ఆదిపరాశక్తిని ప్రార్థించారు. మహిషాసుణ్ణి వధించేందుకై ఆ ఆదిపరాశక్తి 18 చేతులతో క్రొత్త అవతారాన్ని ధరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనుండి వెలవడిన తేజస్సులు ఆ దేవిలోకి ప్రవేశించాయి. దేవతలందరూ ఆ అమ్మవారికి వివిధ ఆయుధాలను సమకూర్చారు. అప్పుడు దేవి మహిషాసురునిపై దండెత్తి, ఆ రాక్షసుని అంతమొందించింది. ఆ తరువాత మహర్షుల ప్రార్థన మేరకు మహిషాసురుని సంహరించినచోటనే కొండపైన ఆదిపరాశక్తి చాముండేశ్వరిగా కొలువుదీరింది. అమ్మవారు కొలువుతీరిన ఈ కొండలనే చాముండేశ్వరి కొండలుగా పిలుస్తారు.
మరొక కథనం ప్రకారం, పూర్వం ఈ కొండమీద చండీ-ముండీ అనే రాక్షసులుండేవారని, అందుకే ఈ కొండను “చండముండ” అని పిలిచేవారని. ఈ కొండ మీదనే ఆదిపరాశక్తి వారిని సంహరించి, చాముండేశ్వరిగా వెలసిందని కూడా చెబుతారు.
అమ్మవారు ఆలయంలో స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై దర్శనమిస్తుంది.