శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కాశ్మీరు - సరస్వతీదేవి

అష్టాదశ మహశక్తి రూపాలలో చివరగా చెప్పబడుతున్న సరస్వతీదేవి వెలసిన పీఠం కాశ్మీర్లో వుంది. కాశ్మీరు రాష్ట్రంలోని శ్రీనగర్‌కు 10కి.మీ. దూరంలో సరస్వతీదేవి ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని చెప్పబడింది.

కాశ్మీరులో సరస్వతీదేవి కొలువుతీరడానికి సంబంధిం చిన గాథ స్థానికంగా ఎంతో ప్రసిద్ధిలో వుంది. శివపార్వతుల కల్యాణం తరువాత వారు కొంతకాలం హిమాలయాలలో విహరించసాగారు. ఆ సమయంలో భూలోకంలో ఒక గృహాన్ని నిర్మించుకోవాలని పార్వతీ దేవికి కోరిక కలిగింది. దాంతో పరమశివుడు విశ్వకర్మని పిలిచి సముద్రమధ్యంలో దీనిని ఏర్పాటుచేసి గొప్ప గొప్ప భవనాలతో కూడిన గొప్ప నగరాన్ని నిర్మింపజేశాడు. అదే లంకా నగరం.

గృహప్రవేశం చేసేందుకై శివపార్వతులు రావణాసురుని పురోహితునిగాపిలిచారు. ఎంతో వైభవంగా గృహ ప్రవేశాన్ని చేయించాడు రావణుడు. దానికి ఆనందించిన పార్వతి, రావణునితో దక్షిణను కోరమని అడిగింది. అప్పుడు రావణుడు లంకానగరాన్ని తనకు దక్షిణగా యివ్వమన్నాడు. మాటయిచ్చిన ప్రకారం లంకానగరాన్ని రావణునికిచ్చారు శివపార్వతులు. తరువాత పార్వతీదేవి ఎంతోయిష్టంగా నిర్మించుకొన్న లంకానగరం యితరులకు యివ్వాల్సి రావడంతో ఎంతోకోపంతోనూ, బాధతోనూ హిమాలయాలకు తిరిగొచ్చింది. ఆ సమయంలో పార్వతి బాధను తగ్గించి, ఆమెను ఓదార్చేందుకు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని పంపాడు. ఆ సందర్భంలోనే సరస్వతీదేవి కాశ్మీరులో కొలువు దీరింది.

కాగా చారిత్రకంగా చూస్తే ఆంగ్లశకం 1-2 శతాబ్దాల నుండే (గుప్తుల కాలంనుండే) యిక్కడ సరస్వతీదేవి పూజలందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆంగ్లశకం 12వ శతాబ్దంలో కల్హణుడు రచించిన రాజతరంగిణిలో ఈ క్షేత్ర ప్రస్తావనవుంది. మహాకవి కాళిదాసు యిక్కడి అమ్మవారిని దర్శించాడని చెబుతారు. స్థానికంగా ఈ అమ్మవారిని ‘కీర్భవాని’ అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని పాలతో అభిషేకించి, పాయసాన్ని నివేదించడం ఆచారంగా వుంది.కాగా కొందరు ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాదుకు సుమారు 150 కి.మీ దూరంలో ఒక శక్తిపీఠం వుండేదని, అదే సరస్వతీ శక్తిపీఠమని చెబుతారు. అయితే ప్రస్తుతం అక్కడ పూర్తిగా శిధిలమైన ఒక ఆలయం మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.