శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ప్రయాగ - మాధవేశ్వరి

ప్రయాగ క్షేత్రంలో అమ్మవారు మాధవేశ్వరిగా కొలువు తీరి, భక్తుల పూజలందుకుంటోంది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరమే ప్రయాగక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారి కుడిచేతి నాలుగు వేళ్ళు పడినట్లుగా చెప్పబడుతోంది.

పూర్వం ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఈ ప్రాంత మాహాత్మ్యాన్ని గుర్తించి, యిక్కడ అనేక యాగాలను చేశాడట. అందువల్లనే ప్రయాగకు ‘ప్రజాపతి క్షేత్రం’ అనే పేరుకూడా పురాణాలలో కనిపిస్తుంది. కాగా 'ప్ర-యాగ' అనే నామములో ‘ప్ర’ అంటే ‘ప్రకృష్ట మైన’, ‘గొప్ప’ అని అర్థం. అంతే కాకుండా ‘ప్ర’ అనే శబ్దానికి ‘ప్రజాపతి’ అనే అర్థాన్ని కూడా చెబుతారు. ప్రజాపతి యాగాలు చేసిన స్థలం కాబట్టి ఈ క్షేత్రానికి ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు.

ఈ క్షేత్రంలోని మాధవేశ్వరిని మొదటగా సూర్య భగవానుడు సేవించాడని చెప్పబడుతోంది. అందుకే దీన్ని భాస్కర క్షేత్రమని చెబుతారు. అంతేకాకుండా శ్రీరామ చంద్రుడు తన వనవాసంలో మొదటగా యిక్కడి మాధ వేశ్వరిని సేవించినట్లుగా తెలుస్తోంది.

ఈ క్షేత్రంలో భరద్వాజుని ఆశ్రమం వుండేదని, అరణ్యవాస ప్రారంభంలో మొదటగా శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రమాన్ని చేరుకొని, ఆయన సూచన మేరకు మాధవేశ్వరిని సేవించాడని పేర్కొనబడింది. మన పురాణాలలో ఈ ప్రయాగ క్షేత్రం ఎంతో గొప్పగా కీర్తించబడింది. స్కాందపురాణం, మత్స్యపు రాణం, అగ్నిపురాణం, పద్మపురాణం, గరుడపురాణాలలోనూ, రామాయణాది మహాభారతాలలోనూ ప్రయాగక్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది.

ప్రయాగ త్రివేణి సంగమ క్షేత్రం. ఇక్కడ సరస్వతి, గంగ, యమునా నదులు సంగమిస్తున్నాయి. అయితే సరస్వతీ నది అంతర్జానం కావడంవలన ప్రస్తుతం యిక్కడ మనం గంగా, యమునా నదుల సంగమాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. అయితే సరస్వతీనది యిక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని మన విశ్వాసం.

ఈ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడంతోపాటు, పితృ దేవతలకు తర్పణాలను యివ్వడం, పిండ ప్రదానాలను చేయడం ఎంతో ప్రసిద్ధంగావుంది. క్షీరసాగర మధనం తర్వాత విష్ణుమూర్తి మోహినీరూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచేసమయంలో ఆదిపరాశక్తి యిక్కడ దేవతలకు దర్శనమిచ్చిందని, దేవతల కోరికమేరకు యిక్కడే మాధవేశ్వరిగా కొలువుతీరిందని చెబుతారు. ఆ సందర్భంలో దేవ గురువైన బృహస్పతి మాధవేశ్వరిని అమృతంతో అభిషేకించాడని, అందుకే ఈ క్షేత్రానికి అమృత తీర్థమనే పేరుందని చెబుతారు.

మాధవేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహం వుండదు. నాలుగు దిక్కులా సమానంగా వుండే ఒక పీఠం వుంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని వేలాడదీసి, క్రింద ఉయ్యాల కడతారు. భక్తులు తాము తెచ్చిన కానుకలను ఈ ఉయ్యాలలో ఉంచి, అమ్మవారిని కొలిచినట్లుగా భావిస్తారు. స్థానికంగా మాధవేశ్వరిని ‘అలోపీదేవి’ అని పిలుస్తారు./