త్ర్యంబకేశ్వర (Tryambakeshwar)
త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం (మహారాష్ట్ర)
త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ లో సహ్యపర్వత శిఖరం మీద నెలకొని ఉంది. గోదావరి నది ఈ సహ్యపర్వతం మీదనే పుట్టింది. ఉత్తర భారతదేశంలో గంగానదివలె, దక్షిణ భారతదేశంలో గోదావరి నది పాపాలను పోగొట్టేదిగా ప్రసిద్ధి చెందింది. ప్రతీ శివాలయంలోనూ శివుడు పానవట్టంపై లింగ రూపంలో దర్శమిస్తాడు. కానీ త్ర్యంబక క్షేత్రంలో ఇందుకు భిన్నంగా పానవట్టం మధ్యలో ఒక గుంతలాగా ఉంటుంది. ఆ గుంతకు మూడు వైపులా త్రికోణా కారంలో మూడు కన్నులుంటాయి. వీటిని పరమశివుని మూడు నేత్రాలుగా భావిస్తారు. పానవట్టం మధ్యలోని గుంతలో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. బ్రహ్మపురాణంలోనూ, శివమహాపురాణంలోనూ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావానికి సంబం ధించిన కథ చెప్పబడింది. ఒకప్పుడు అనావృష్టి కారణంగా తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు లేక జనులంతా ఆకలితో అల మటించసాగారు. కరువు కారణంగా పశుపక్ష్యాదులూ విలవిలలాడాయి. ఈ దైన్యస్థితిని చూసిన గౌతముడు కరువు నివారణకై వరుణదేవుని గురించి తపస్సు చేశాడు. గౌతముని తపస్సుకు సంతసించిన వరుణుడు ఆ ప్రాంతానికి అక్షయ తటాకాన్ని ప్రసాదించాడు. అక్షయ తటాకం అంటే అందులోని నీరు ఎంత వినియోగించినా అది తరగకుండా అక్షయంగా ఉంటుంది. ఈ తటాకంలోని నీటివల్ల ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. కరువు నివారించబడి జనులంతా సుఖంగా వుండసాగారు. అయితే గౌతమునివల్ల కరువు తొలగిపోవటాన్ని చూసిన తక్కిన ముని పత్నులు భరించలేకపోయారు. వారందరికీ గౌతముని పైనా, ఆయన భార్య అహల్యపైనా ఎంతో అసూయ కలిగింది. దాంతో వారంతా గౌతమ మహర్షికి అపకారం తలపెట్టమని తమ భర్తలను ప్రేరేపించారు. చివరకు మునులంతా కలిసి, గౌతమునిపై కుట్ర చేసి, ఒక మాయాగోవును గౌతముని పొలంలోకి తోలారు. ఆ గోవు పంటను మేయసాగింది. దాంతో గౌతముడు దాన్ని గడ్డి పరకతో అదిలించాడు. వెంటనే ఆ ఆవు నేలకొరిగి మరణించింది. సమయంకోసం వేచివున్న అక్కడి మునులందరూ వచ్చి గౌతముడు గోహత్య, చేశాడని, కాబట్టి ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళమంటూ గౌతముని శాసించారు. అప్పుడు గౌతముడు గోహత్య పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని ఆ మునులను అడిగాడు. దానికి వారు ఆ ప్రాంతానికి గంగను రప్పించి, ఆ జలంతో కోటి శివలింగాలను అభిషేకించాలని చెప్పారు. దాంతో గంగకోసం గౌతముడు బ్రహ్మగిరిపై పార్థివ లింగాన్ని నెలకొల్పి భక్తితో ఆరాధించసాగాడు. అప్పుడు పరమేశుడు ప్రత్యక్షమై గంగను ప్రసాదిం చాడు. వెంటనే ఆ ప్రాంతంలో గంగాప్రవాహం ఏర్పడింది. ఆ నదీ ప్రవాహం గౌతముని పొలాన్ని చేరినంతనే పొలంలో మరణించిన ఆవు తిరిగి బ్రతికింది. గౌతమునిచేత తీసుకొని రాబడిన కారణంగా ఆ నది గౌతమియని, గోహత్య పాతకం నుండి గౌతమునికి విముక్తి కలిగించడంచేత గోదావరి యని ప్రసిద్ధిచెందింది. ఈ సందర్భంలోనే యిక్కడ పరమేశుడు త్ర్యంబకేశ్వరునిగా కొలువుదీరాడు.