శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కొల్హాపూర్ - మహాలక్ష్మి

మహారాష్ట్రలోని కొల్హాపూర్ క్షేత్రంలో కొలువైన మహాలక్ష్మీదేవిని స్థానికులు “అంబాబాయి” అని పిలుస్తారు. ఈ అమ్మవారిని భవానీమాతాయని, ‘కరవీరవాసాని’ అనికూడా స్థానికులు పేర్కొంటారు. ఇక్కడ సతీదేవి యొక్క నేత్రాలు పడినట్లుగా చెప్పబడింది. ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు కూడా వుంది. ప్రళయకాలంలో నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్న మహాలక్ష్మి తన కరములతో పైకెత్తడం వలన, దీనికి ఆ పేరొచ్చింది.

ముక్తిని ప్రసాదించే ఆరు క్షేత్రాలలో ఈ కరవీరక్షేత్రం కూడా ఒకటి. తక్కినవి విరూపాక్షం (హంపి), శ్రీశైలం, పండరీపురం, శ్రీరంగం, రామేశ్వరం. స్థలపురాణం ప్రకారం పూర్వం కొల్హుడు అనే రాక్షసుడు బ్రహ్మచేత యుద్ధంలో సులభంగా విజయం లభించే వరాన్ని పొందాడు. ఆ వరంతో అన్ని రాజ్యాలను జయించాడు. తరువాత యితర లోకాలను ఆక్రమించేందుకు బయలుదేరిన కొల్హుడు రాజ్యభారాన్ని తన పెద్ద కుమారుడైన కరవీరునికి అప్పగించి, మిగిలిన తన ముగ్గురు కుమారులను అతనికి సహాయకులుగా నియమించాడు. కరవీరుడు అతని ముగ్గురి కుమారులు కూడా జనాలను బాధపెడుతూ, ఋషులను, మునులను బాధిస్తూ, యజ్ఞయాగాదులను ధ్వంసం చేయసాగారు.

దాంతో దేవతల కోరిక మేరకు పరమేశుడు కరవీరుని, అతని ముగ్గురు సోదరులను అంతమొందించాడు. తన కుమారుల మరణానికి ఎంతగానో పరితపించిన కొల్హుడు రాజ్యానికి తిరిగివచ్చి, దేవతలపై పగ పెంచుకుని, ప్రతీకారంతో వారిని హింసించసాగాడు. చివరకు దేవతల ప్రార్ధన మేరకు మహాలక్ష్మి స్వరూపంలో ఆదిపరాశక్తి కొల్హుడిని సంహరించింది. కొల్హుని చివరి కోరిక మేరకు మహాలక్ష్మి కొల్హాపురంలోనే కొలువుతీరిందని, కొల్హుడు చంపబడిన ఈ ప్రాంతం కొల్హాపురంగా పేరొందిందని చెబుతారు.

కొల్హాపురి ఆలయం మహారాష్ట్ర నిర్మాణ శైలిలో చూసేందుకు ఎంతో గొప్పగా కనిపిస్తుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహశిలను ఎంతో ప్రశస్తమైన మణిశిలగా పేర్కొంటారు. సింహవాహనియైన ఈ దేవి చతుర్భుజురాలై, చేతులలో చెరుకువిల్లు, ఫలం, డాలు, కలశాన్ని ధరించి వుంటుంది. కిరీటమకుటంగల ఈ దేవి శిరస్సుపై అయిదు శిరస్సుల ఆదిశేషుడు ఛత్రం పడుతున్నట్లుగా వుంటాడు. నల్లని ముఖంతో అనేక ఆభరణాలతో అలరారే ఈ దేవిని దర్శించేందుకు రెండు కన్నులూ చాలవని భక్తులంటారు.