శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
గిరిజాదేవి - ఓఢ్యాణం
ఓఢ్యాణం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ జిల్లాలో వుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారికి గిరిజాదేవి అనిపేరు. స్థానికులు ఈ దేవిని విరజాదేవి, బిరిజాదేవి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి యొక్క నాభిభాగం పడిందని ప్రతీతి.
స్థలపురాణం ప్రకారం లోకశాంతికోసం ఈ క్షేత్ర ప్రాంతంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని చేసాడు. ఆ యజ్ఞ గుండం నుండి ఆదిపరాశక్తి ఉద్భవించి, బ్రహ్మ దేవుణ్ణి వరాన్ని కోరుకోమన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని భూమిపై వెలసి, లోకాలకు శాంతిని ప్రసాదిస్తూ, భక్తులను కటాక్షిస్తుండమని కోరుకున్నాడు. దాంతో అమ్మవారు గిరిజాదేవిగా ఈ క్షేత్రంలో వెలసింది. ఓఢ్యాణంలోని ఆలయం ఒరిస్సా నిర్మాణ పద్ధతిలో నిర్మితమైంది. ప్రాచీనమైన ఈ ఆలయం నిర్మాణశైలిలో రాజపుత్రదర్పం కనిపిస్తుంది. ఆలయంలో అమ్మవారి ముఖం మాత్రం కన్పించే విధంగావుంచి, మిగతా విగ్రహాన్నంతా బంగారు ఆభరణాలతోనూ, పూలమాలలతోనూ అలంకరిస్తారు.
ఈ అలంకరణలో అమ్మవారు కుడిచేత చక్రాన్ని ధరించినట్లుగా కూడా చూపుతారు. అయితే అమ్మవారి నిజస్వరూపం దుర్గా స్వరూపంగా చెప్పబడుతోంది. క్రిందపడివున్న ఒక మహిషం మీద అమ్మవారు నిలుచుని, కుడిచేత శూలాన్ని ధరించి, ఎడమచేత మహిషం యొక్క తోకను పట్టుకుని, ఉగ్రస్వరూపిణిగా వుంటుంది. కానీ అలంకరణలో అమ్మవారు సౌమ్యమూర్తిగానే దర్శనమిస్తుంది. సంవత్సరంలో ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రం అమ్మవారి మూలరూపాన్ని దర్శించే అవకాశం వుంటుంది.
ఓఢ్యాణం నాభిగయ క్షేత్రం కాబట్టి చాలా మంది యిక్కడ ఆలయ ప్రాంగణంలోనే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ వుంటుంది. ఈ నదీతీరంలోనే యమధర్మరాజు ఆలయంకూడా వుంది. ఈ ఆలయానికి కొంచెం దూరంలోనే శ్వేతవరాహస్వామి ఆలయాన్ని కూడా చూడవచ్చు.