శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

జ్వాలాక్షేత్రం - వైష్ణవీదేవి

జ్వాలాక్షేత్రంలో అమ్మవారు వైష్ణవీదేవిగా కొలువుదీరింది. ఇక్కడ సతీదేవి శిరస్సు పడింది. కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ము నగరానికి 60కి.మీ. దూరంలో వైష్ణవీదేవి ఆలయం వుంది. ఈ ఆలయాన్ని దర్శించాలనుకునేవారు ముందుగా జమ్ము నుంచి కత్రాకు చేరుకోవాలి. ఆలయం వెలసిన పర్వతానికి త్రికూట పర్వతం అని పేరు. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో వుంది.

మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని సూచనమేరకు పాండవులు వైష్ణవీదేవిని పూజించారని చెబుతారు. ఇక్కడి ఆలయంలోని అమ్మవారు గుహలో కొలువుతీరి వుంది. దాదాపు 100 అడుగుల గుహలో, గుహ గోడపైన వైష్ణవీదేవి దర్శనమిస్తుంది. ఈ గుహలోకి వెళ్ళాలంటే కొంతదూరం బాగావంగి నడవాల్సి వుంటుంది.గుహలో అమ్మవారు శిలారూపంలో కొలువుతీరింది. ఈ శిల క్రింది భాగంలో ఒకటిగానే వుండి పైభాగానికి వచ్చేటప్పటికి మూడు భాగాలుగా గోచరిస్తోంది.

కుడివైపున వుండే నల్లని శిలాభాగాన్ని మహాకాళిగా, మధ్యలోవుండే పచ్చని భాగాన్ని లక్ష్మిగా, ఎడమవైపున వుండే తెల్లనిభాగాన్ని సరస్వతిగా చెబుతారు. అంటే యిక్కడి అమ్మవారు ఏకీకృతమైన త్రిశక్తిస్వరూపం అన్నమాట. గుహలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని ‘చరణ్ గంగ’ అని పిలుస్తారు. కాగా కొందరు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోని అమ్మవారిని 15వ శక్తిపీఠమైన వైష్ణవీదేవిగా చెబుతున్నారు. ఇక్కడ సతీదేవి నాలుక పడినట్లుగా చెప్పబడింది. ఇచ్చట గల అమ్మవారికి జ్వాలాముఖీ అని పేరు. ఈ క్షేత్రంలో కూడా అమ్మవారికి విగ్రహం వుండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా (రూపంగా) భావిస్తారు. ఈ జ్వాలలను అవమాన భారానికిగురైన సతీదేవి ఆగ్రహానికి సంకేతమని చెబుతారు.ఏది ఏమైనప్పటికీ ఎక్కువమంది జమ్ముకు సమీపంలో గల వైష్ణవీదేవి నిలయాన్నే 15వ శక్తిపీఠంగా భావిస్తున్నారు.