శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

గయ - మాంగల్యగౌరి

అష్టాదశ శక్తిపీఠాల్లో పదహారవ శక్తిపీఠమైన గయాక్షేత్రంలో పరాశక్తి మాంగల్యగౌరిగా కొలుదీరింది. ఈ దేవినే మంగళగౌరీదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి యొక్క స్తనాలు పడినట్లుగా చెప్పబడుతోంది.గయా క్షేత్రం ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో రాజధాని నగరమైన పాట్నాకు - సుమారు 75కి.మీ. దూరంలో వుంది.

మన పితరులకు ముక్తిని కలిగించే మూడు గయాక్షేత్రాలలో ఈక్షేత్రం శిరోగయగా చెప్పబడుతోంది. తక్కినవి మనరాష్ట్రంలోని పిఠాపురం (పాదగయ), ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ దగ్గర అష్టాదశ శక్తి స్వరూపాలలో ఒకరైన గిరిజాదేవి కొలువుదీరిన ఓఢ్యాణం (నాభిగయ). కాగా ఈ గయాక్షేత్ర స్థలపురాణం కూడా గయాసురునితోనే ముడిపడి వుంది (ఈ పురాణ కథ పిఠాపురం క్షేత్ర వివరణలో యివ్వబడింది).

అయితే ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువుదీరడానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో వుంది. ఆ కథ ప్రకారంగా బ్రహ్మదేవుని మానస పుత్రుడు మరీచి మహర్షి ఆయన భార్య ధర్మవ్రత. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండేవారు. ఒకనాడు భోజనానంతరం మరీచి పడుకొని దర్మవ్రతను కాళ్ళు పట్టమన్నాడు. ధర్మవ్రత కాళ్ళు పడుతుండగా మరీచి నిద్రలోకి జారుకున్నాడు.

అదే సమయంలో బ్రహ్మదేవుడు వారి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ధర్మవ్రత కాళ్ళు పట్టడాన్ని ఆపి బ్రహ్మ దేవుడికి అతిథి సత్కారాలు చేయసాగింది. దాంతో నిద్రాభంగమైన మరీచి భర్తసేవను విడిచి పరాయి పురుషుణ్ణి సేవించిందనే నెపంతో ధర్మవ్రతను శిలగా మారిపొమ్మని శపించాడు.కానీ దానికి ధర్మవ్రత తాను ధర్మాచరణకే అంటే అతిథిని సత్కరించేందుకే భర్తసేవను మానడం జరిగిందని, కాబట్టి తన తప్పులేదని, తాను శాపాన్ని అంగీకరించనంటూ విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసింది.

విష్ణువు ప్రత్యక్షమై, మహర్షి శాపం ఆపడం ఎవరి వల్లా కాదని, కాబట్టి శాపాన్ని అంగీకరించమని ధర్మవ్రతకు సూచించాడు. దాంతో ధర్మవ్రత తాను శిలగా మారిపోతానని, అయితే ఆ శిలపై విష్ణుపాదాలు నిత్యం వుండాలని, ఆ శిలను తాకిన వారికి మోక్షం కలగాలని విష్ణువును కోరింది. అందుకు అంగీకరించాడు విష్ణువు.

తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రచ్ఛన్న వేషంలో గయాసురుని దేహాన్ని యజ్ఞవాటిగా చేసుకొని యాగం చేసేటప్పుడు, గయాసురుని తల కదలకుండా వుండేందుకు ఆ తలపై ఒక శిలను వుంచాల్సి వచ్చింది. అప్పుడు విష్ణువు గతంలో శాపం కారణంగా ధర్మవ్రత శిలగా మారివుండటం వలన, ఆ శిలనే తెచ్చి గయుని తలపై వుంచాడు. తాను ఆ శిలపై నిలుచున్నాడు. తరువాత విష్ణువు గయలో గదాధరునిగా వెలిశాడు.అయితే ఈ క్షేత్రంలో ధర్మవ్రత తాను శిలగా మారే ముందు పరాశక్తిని ప్రార్థించి, ఆ దేవిని తాను శిలగా పడివుండే ప్రాంతంలో కొలువుతీరమని కోరడంతో, యిక్కడ అమ్మవారు మాంగల్యగౌరిగా వెలసిందని చెబుతారు.

కాగా గయా క్షేత్రంలో ఫల్గుణి, మధుర, శ్వేత అనే మూడు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో ఫల్గుణీనది ముఖ్యమైంది. అయితే ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని చెబుతారు.గయలో గదాధరుని ఆలయానికి విష్ణుమందిరం అని పేరు. ఈ విష్ణు మందిరానికి ప్రక్కన మాంగల్యగౌరీదేవి ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయంలో అమ్మ వారు చక్కటి అలంకరణతో దర్శనమిస్తారు. ఈ అమ్మ వారిని విష్ణుసహోదరిగా చెబుతారు. ఈ గయా క్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ఎంతో ప్రసిద్ది.