శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
మల్లికార్జునక్షేత్రం ( ఆంధ్రప్రదేశ్ )
శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవులనడుమ కృష్ణానదికి కుడివైపున వుంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో కూడా ఒకటి కావడంచేత ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది మరియు ఇలం వెలసినది ‘కైలాసం’గా పేరొందింది. ఆదిపరాశక్తి ఈ క్షేత్రంలో భ్రమరాంబగా కొలువుతుంది. శ్రీశైలక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని స్కాంద పురాణం అంటోంది. అందుకే మనం వివిధ వైదిక కర్మలను — పూజలు, వ్రతాలు మొదలైన వాటిని ఆచరించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో “శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే.... శ్రీశైలస్య ఉత్తర దిగ్భానే” అంటూ మన ఉనికిని శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెబుతాం. అంటే మనం శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున వుండి వైదికకర్మను ఆచరిస్తున్నామనే విషయాన్ని సంకల్పంలో వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్షేత్రాధిదేవుడైన మల్లికార్జునుడు పర్వతుని తపస్సు కారణంగా ఇక్కడ స్వయంగా ఉద్భవించగా, క్షేత్రాధిదేవత అయిన భ్రమరాంబాదేవి అరుణా సురుడనే రాక్షసుని సంహరించి ఈ క్షేత్రంలో స్వయంగా వెలసింది. కృతయుగ ప్రారంభంలో శిలాదుడనే ఋషి, సంతానం కోసం శివుని గురించి తపస్సు చేసి అయోనిజనులైన ఇద్దరు కుమారులను పొందాడు. వారిలో మొదటి కుమారుడు నందికేశ్వరుడుకాగా, రెండవవాడు పర్వతుడు. తరువాత నందికేశ్వరుడు శివుని కోసం తపస్సు చేసి శివునికి వాహనమయ్యాడు. దాంతో పర్వతుడుకూడా కనీవినీ ఎరుగని రీతిలో నిరాహారంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై పర్వతుని వరం కోరుకోమన్నాడు. దానికి పర్వతుడు తాను పర్వత ఆకారాన్ని ధరించి స్థలంగావుండే విధంగాను, తనపై శివుడు శాశ్వతంగా కొలువుతీరివుండే విధంగా వరాన్ని కోరుకున్నాడు. ఆ వరాన్ని అనుగ్రహించాడు పరమశివుడు. దాంతో పర్వతుడు పర్వత ఆకారాన్ని పొంది పర్వతంగా వుండగా ఆ పర్వతంపై శివుడు స్వయంభువుగా పర్వతలింగమై కొలువుదీరాడు. ఆ పర్వతమే శ్రీపర్వతంగా పేరొందగా, స్వామి శ్రీపర్వతస్వామిగా పిలవబడసాగాడు. కాలక్రమంలో శ్రీపర్వతం శ్రీశైలమని పిలువబడగా, శ్రీపర్వతస్వామికి మల్లికార్జునుడనే నామం ఏర్పడింది. చెప్తున్నట్లుగా శ్రీపర్వతస్వామిగా పిలువబడిన శ్రీశైలనాథునికి మల్లికార్జునుడనే పేరు రావడానికి చంద్రవతి వృత్తాంతం కారణంగా కూడా చెప్పబడుతోంది. పూర్వం చంద్రవతి అనే రాజకుమార్తె ప్రతినిత్యం శ్రీపర్వతస్వామిని మల్లికా పుష్పాలతో (అడవి మల్లెలతో) పూజించేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆ భక్తురాలు స్వామి గంగనుధరించి వున్నట్లుగానే తాను సమర్పించిన మల్లికా పుష్పాలను కూడా ఎల్లప్పుడూ ధరించి వుండాలని కోరింది. ఆమె కోరికను మన్నించాడు శ్రీపర్వతస్వామి. ఈ విధంగా శ్రీపర్వతస్వామి “మల్లికార్చితుడు” (మల్లెల చేత పూజింపబడినవాడు) అయినాడు. “మల్లికార్చితుడు” నామమే కాలక్రమంలో “మల్లికార్జునుడు” అనే నామంగా మారిందని భావించబడుతోంది.