శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
కేదారనాథ్ (ఉత్తరాంచల్)
ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది అయిన కేదారనాథ జ్యోతిర్లింగం హిమాలయ పర్వత ప్రాంతంలోని కేదారనాథ్ క్షేత్రంలో నెలకొని ఉంది. హిమాలయాలలోని కేదార శిఖరమే కేదారనాథ లింగం. జ్యోతిర్లింగాలలోని అతి పెద్ద శివలింగంయిదే. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 11,760 అడుగుల ఎత్తులో వుంది. ఈ క్షేత్రంలో పర్వత శిఖరమే లింగం కనుక యిక్కడి స్వామికి పానవట్టం లేదు. ఈ ప్రాంతం మంచు ప్రదేశం అయినందువల్ల ఆలయం సంవత్సరంలో ఆరు మాసాలపాటు మూయబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు (సాధారణంగా మే నుండి అక్టోబరు వరకు) మాత్రమే భక్తులు ఆలయాన్ని దర్శించ వచ్చు. ప్రధాన ఆలయం మూసివున్న సమయంలో కొంత క్రింది భాగంలో వున్న ఉర్విమఠంలోని స్వామిని భక్తులు దర్శించుకుంటారు. స్కాందపురాణంలోని కేదారఖండంలో కేదారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యం చెప్పబడింది. కాగా ఏ భక్తుడైనా కేదారనాథుని దర్శించకుండా, బదరీయాత్ర చేసినట్లైతే ఆ యాత్ర నిష్పలమని స్కాందపురాణం చెబుతోంది. కృతయుగంలో శ్రీమహావిష్ణువు అవతార స్వరూపులైన నరనారాయణులు బదరికావనంలో జగత్కల్యాణం కోసం ఎన్నో వేల సంవత్సరాలు పరమశివుని గురించి తపమాచరించారు. ఆ తపస్సుకు సంతుష్టుడైన పరమశివుడు వారికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు వారిరువురూ కేదారశిఖరంపై కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తుండమని పరమశివుని కోరారు. పరమేశుడు వారి కోరికను మన్నించి అక్కడ జ్యోతిర్లింగంగా వెలశాడు. కేదారనాథ శిఖరంపై వెలసిన కారణంగా ఈ స్వామి కేదారేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు.