శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
మహాకాళేశ్వరుడు (ఉజ్జయిని)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వెలసిన స్వామికి మహాకాళేశ్వరుడని పేరు. ఈ ఉజ్జయిని పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒక్కటి కూడా. ఇక్కడి అమ్మవారిని మహాకాళీగా పిలుస్తారు. మన పురాణాలు ఈ ఉజ్జయిని అవంతి, అవంతిక, విశాల, కుశస్థలి, అమరావతి, కనకశృంగా అనే పేరులతో ప్రస్తావించాయి. మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఉజ్జయిని కూడా ఒకటిగా చెప్ప బడింది. తక్కినవి, అయోధ్య, మధుర, కాశి, కంచి, పురీ, ద్వారక. శివపురాణంలో మహాకాళేశ్వరుని ఆవిర్భవానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తోంది. ఈ కథ ప్రకారం - పూర్వం అవంతీ నగరంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. వేదాధ్యయన పరుడు. అతనికి దేవప్రియుడు, సుమేధనుడు, సుకృతుడు, ధర్మవాహినుడనే నలుగురు కుమారులుం డేవారు. వారూ గొప్ప శివభక్తులే. వేదప్రియుడు అతని పుత్రులు రోజూ పార్థివలింగాన్ని చేసి భక్తి శ్రద్ధలతో అర్చించేవారు. వేద పారాయణలను చేసేవారు. ఈ కారణంగా ఆ ప్రదేశ మంతా పాడిపంటలతో తులతూగుతుండేది.
ఇదిలావుండగా యిక్కడి సమీపంలోని రత్నమాలా పర్వతంపై దూషణుడు అనే దుష్ట రాక్షసుడు వుండేవాడు. బ్రహ్మచేత వరాలను పొందిన ఆ రాక్షసుడు వరగర్వంతో లోకాలన్నింటినీ బాధించేవాడు. వేదధర్మ వ్యతిరేకి అయిన ఆ రాక్షసుడు శివపూజలను, యజ్ఞయాగాలను మానమని వేదప్రియుని, అతని కొడుకులను హింసించసాగాడు. కానీ, వారు శివపూజలు మానలేదు. దాంతో దూషణుడు ఆ బ్రాహ్మణులను చంపబోయాడు. అప్పుడు పరమేశ్వరుడు రౌద్రస్వరూపునిగా హుంకారంతో ప్రత్యక్షమై ఆ రాక్షసుని భస్మం చేసాడు. తరువాత ఉజ్జయినిలో మహాంకాళేశ్వరునిగా కొలువుదీరాడు. పరమేశ్వరుడు ఇక్కడ రౌద్రరూపంలో, హుంకారముతో ప్రత్యక్షమైన కారణంగా ఆయనకు మహాకాలుడనే పేరొచ్చింది.
ఇక ఈ క్షేత్రానికి సంబంధించి మత్స్యపురాణంలో మరోకథవుంది. ఒకప్పుడు అంధకుడనే రాక్షసుడు పార్వతిని అపహరించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుని మహాకాలరూపంలో సంహరించి, దేవతల కోరికమేరకు ఉజ్జయినిలో మహాకాలునిగా నిలచిపోయాడు.