శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కాంచీపురం - కామాక్షి

తమిళనాడులోని కాంచీపుర క్షేత్రం-మహాశక్తి పీఠాలలో రెండవది చెప్పబడింది. దీనికి కంచి అని కూడా పేరు. ఈ క్షేత్రంలో అమ్మవారి వీపుభాగం పడింది. ఇక్కడి అమ్మవారి నామం కామాక్షీదేవి. ఇక్కడి స్థలపురాణం ప్రకారం శివుడులేని ఒకానొక సందర్భంలో పార్వతీ దేవి దిగంబరులైన తన చెలికత్తెలతో గడుపుతూవుంది. ఈ లోగా పరమేశ్వరుడు హఠాత్తుగా పార్వతీదేవి మందిలోకి ప్రవేశించాడు. అప్పుడు తన చెలికత్తెల మానాన్ని కాపాడేందుకు పార్వతిదేవి తన రెండు చేతులతో శివుడు రెండు కన్నులనూ మూసింది. శివుని కన్నులు మూయడంతో సూర్యచంద్రుల వెలుగుకరువై లోకాలన్నింటిలో చీకట్లు అలుముకున్నాయి. అకాలప్రళయం సంభవించింది.

అనేక జీవులు ప్రాణాలు కోల్పోయాయి. అకాల ప్రళయానికి కారణమైన పాప ఫలితంగా పార్వతీదేవి శరీరమంతా పూర్తిగానల్లగా మారిపోయింది. దాంతో పార్వతీదేవి తనను కాపాడమని శివుని వేడుకుంది, తరుణోపాయాన్ని చెప్పాడు శివుడు.

పరమశివుని సూచనమేరకు పార్వతి బాలిక రూపంలో బదరికాశ్రమాన్ని చేరుకొని, అక్కడ కాత్యాయన మహర్షికి కూతురుగా కొంతకాలం గడిపింది, తరువాత కంచి క్షేత్రాన్ని చేరుకుని, అక్కడ సైకత లింగాన్ని రూపొందించుకొని, పంచబాణ మంత్రంతో తపస్సు చేయసాగింది. ఈ పంచబాణ మంత్రం మన్మథాత్మకమైన కారణంతో శివుడు కామాగ్నికి గురయ్యాడు. అప్పుడు పార్వతీదేవిని పరీక్షించమని గంగను పంపాడు శివుడు. గంగ ఉప్పొంగి కంచి క్షేత్రాన్నంతా నీటితో ముంచింది. ఆ సమయంలో పార్వతి తన రక్షణకోసం సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. పార్వతీ దేవి యొక్క స్పర్శలో పరమశివుడు పులకించిపోయాడు. వెంటనే శివుడు ఏకామ్రేశ్వర రూపంలో పార్వతికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవతలందరూ వారిద్దరికీ కళ్యాణం జరిపించారు. ఆ సందర్భంలో పార్వతీదేవి తన చూపులతోనే అందరిపైనా అమృతాన్ని కురిపించింది. దీనిని గమనించిన పరమేశ్వరుడు ఆమెకు కామాక్షి అనే పేరును పెట్టాడు. ఆ తరువాత దేవతల, ఋషుల కోరిక మేరకు ఏకామ్రేశ్వరుడు, కామాక్షీదేవి కంచిలో కొలువుదీరారు.

ఈ ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో చతుర్బ జాలతో దర్శనమిస్తుంది. నాలుగు చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడ, ధనుస్సు వుంటాయి. ఈ తల్లిని దర్శించినంతనే ఆమె చల్లని చూపులు భక్తులపై ప్రసరించి, భక్తుల కోరికలు నెరవేరుతాయి.