శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీలంక - శాంకరీదేవి
అష్టాదశ శక్తిపీఠాలలో లంకలోని శాంకరీదేవిక్షేత్రం మొదటి శక్తిపీఠంగా పేర్కొనబడింది. ఇక్కడ సతీదేవి కాలిగజ్జెలు పడినట్లుగా చెప్పబడింది. ప్రస్తుతం శ్రీలంకదేశ రాజధాని కొలంబో నగరానికి సుమారు 270 కి.మీ దూరంలోవుండే ట్రింకోమలై పట్టణాన్ని శక్తిపీఠంగానూ, అక్కడి అమ్మవారిని శాంకరీదేవి గానూ భావిస్తున్నారు.కాగా మన ప్రాచీన మహర్షుల లెక్కప్రకారం ఈ శక్తి క్షేత్రం సరిగ్గా భూగోళానికి మధ్య భాగంలో వుండేదని చెప్పబడింది. అయితే ఋషులు పేర్కొన్న ఈ భూమధ్యప్రాంతం, ప్రస్తుత భూమధ్యరేఖ ఒకటికాదనే భావన కూడావుంది.
ఏది ఏమైనప్పటికీ ఈ శక్తిపీఠం భూమధ్య భాగంలో వుందని చెప్పబడిన కారణంగా, శ్రీలంకలోని ట్రింకోమలై శక్తిపీఠం కాదని కొందరు పేర్కొం టున్నారు. అయితే ఈ శక్తిపీఠం గురించి స్పష్టమైన ఆధారం లభించని కారణంచేత, ఇంకా ఎక్కువమంది విశ్వసిస్తున్నందువల్ల, శ్రీలంకలోని స్థానిక కథలనుబట్టి, ప్రస్తుతానికి ట్రింకోమలైనే శక్తిపీఠక్షేత్రంగా భావించడం సబబుగా వుంటుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణకథ లంకాధిపతి రావణాసురునితో ముడిపడివుంది.
ప్రసిద్ధిలో వుండే కథనం మేరకు, త్రేతాయుగంలో రావణాసురుడు పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుని, ఆ దేవిని తన రాజ్యంలో కొలువుతీరేలాగా వరాన్ని పొందాడు. ఆ విధంగా పార్వదీదేవి లంకానగరంలో శాంకరీదేవిగా కొలువుదీరింది. దాంతో అది శక్తిపీఠ క్షేత్రమైంది. అయితే పార్వతీదేవి లంకలో కొలువుదీరేటప్పుడు రావణుడు సన్మార్గంలో వున్నంతకాలం వరకు మాత్రమే తాను లంకలో కొలువై వుంటానని, రావణుడు అకృత్యాలకు పాల్పడి, అధర్మవర్తనుడైతే తాను లంకను వీడుతానని షరతును విధించింది. తరువాత కాలంలో రావణుడు సీతాదేవిని అపహరించడంతో పార్వతీదేవి లంకను వీడి, హిమాలయా లలో స్థిరపడిందని చెప్పబడింది.
అయితే ప్రస్తుతం ట్రింకోమలైలోని శాంకరీదేవి ఆలయానికి దగ్గరలోగల కొండపై ఒక శిధిలాలయం వుండేదని, అదే శాంకరీదేవి ఆలయమని కొందరు పేర్కొంటున్నారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దాడిచేసి, ఈ ఆలయాన్ని కూలగొట్టారని చెప్పేందుకు చారిత్రక ఆధారాలు లభించాయని కూడా చెబుతారు. అయితే ఆ ప్రదేశంలో ప్రస్తుతం శిధిలాలయం ఏదీలేదు. అక్కడ ఒక స్తంభాన్ని మాత్రం మనము చూడవచ్చు.