శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ద్రాక్షారామం - మాణిక్యాంబ
ద్రాక్షారామం మనరాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో వుంది. ఇక్కడి అమ్మవారికి మాణిక్యాంబ అని పేరు. స్థానికంగా ఈమెను మాణిక్యాదేవి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో సతీదేవి ఎడమచెంప పడినట్లుగా చెప్పబడుతోంది. ద్రాక్షారామం పంచారామ క్షేతం కూడా. ఇక్కడి స్వామికి భీమేశ్వరుడని పేరు. మన పురాణాలలో దక్షవాటికగా చెప్పబడిన ఈ ద్రాక్షారామం, సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమని చెబుతారు.
ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్ళాడు. శివుడు ఆయన్ను పరీక్షించదలచి, వ్యాసునికి కాశిలో తిండి దొరకకుండా చేసాడు. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీని శపించబోతే, అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసునికి, అతని పరివారానికి అన్నాన్ని పెట్టింది. కానీ పరమేశుడు మాత్రం కోపంతో వ్యాసుణ్ణి కాశీ క్షేత్రం విడిచి వెళ్ళమన్నాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసునికి ద్రాక్షారామానికి వెళ్ళమని చెప్పడంతో వ్యాసుడు యిక్కడకొచ్చి ఈ క్షేత్రంలో చాలాకాలం వున్నాడని పురాణకథ.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం పూర్వం కుమార స్వామి తారకాసురుని మెడలోని అమృతలింగాన్ని చేధించి, తారకుణ్ని సంహరించాడు. కుమారస్వామిచే ఛేదింపబడిన అమృతలింగం అయిదు ముక్కలై ఐదు ప్రాంతాలలో పడిన సందర్భంలో ఒక భాగం ద్రాక్షారామంలో పడింది. అప్పుడు సప్తఋషులు ఈ శకలానికి పవిత్ర గోదావరి జలంతో సంప్రోక్షణ చేసి, యిక్కడ ప్రతిష్ఠించాలని భావించారు. అందుకు ద్రాక్షారామానికి రావల సిందిగా గోదావరిని ప్రార్థించారు ఋషులు. గోదావరి అంగీకరించి ఋషు లను అనుసరించింది.
కారణాంతరాలవలన సప్తఋషులు గోదావరితో సకాలంలో అంటే ప్రతిష్ఠాముహూర్తానికి ద్రాక్షారామాన్ని చేరుకులేకపోతారు. ఆ కారణంగా దేవతల కోరిక మేరకు పరమశివుడే ద్రాక్షారామంలో స్వయంగా ప్రతిష్టితుడై భీమేశ్వరునిగా కొలువుతీరాడు. ఈ సందర్భంలోనే అమ్మవారు మాణిక్యాంబ పేరుతో భీమేశ్వరుని దేవేరిగా యిక్కడ కొలువుతీరింది.
ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో మాణిక్యాంబ ఆలయం వుంది. అయిదు ప్రాకారాలుగల భీమేశ్వర ఆలయంలోని రెండవ ప్రాకారంలో లోపలిభాగంలో చుట్టూ మండపాలున్నాయి. ఈ రెండవ ప్రాకారంలోని మండపాలలోనే ఉత్తర ఈశాన్య భాగంలో అమ్మవారి ఆలయం వుంది. శ్రీచక్ర మేరువుపై నెలకొనివున్న ఈ దేవి రెండు చేతులను కలిగివుండి, కుడి వైపు ఉత్పలాన్ని ధరించి, ఎడమ వైపు ప్రలంబహస్తంతో దర్శన మిస్తుంది.