శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
అలంపురం - జోగుళాంబ
అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలలో అయిదవ శక్తిపీఠ క్షేత్రంగా చెప్పబడిన అలంపుర క్షేత్రంలో అమ్మవారు జోగుళాంబగా పిలువబడుతున్నారు. ఇక్కడ సతీదేవి ఖండితాంగాలలోని పై వరుస దంతపంక్తి (దవడభాగం) పడిందని చెప్పబడింది. తెలుగుప్రాతంలోగల నాలుగు శక్తిపీఠ క్షేత్రాలలో ఈ క్షేత్రం మొదటిది.
శ్రీశైల మహాక్షేత్రానికి నలుదిక్కులా నాలుగు ప్రధాన ద్వారక్షేత్రాలు, నలుమూలలా నాలుగు ఉపద్వార క్షేత్రాలు ఉన్నాయని స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం చెబుతోంది. చారిత్ర శాసనాలలో కూడా ఈ ద్వార క్షేత్రాల ప్రస్తావన ఆంగ్లశకం 7-8 శతాబ్దాల నుండి కనిపిస్తున్నది. కాగా శ్రీశైల క్షేత్రానికి ఈ అలంపురం పశ్చిమ ద్వారంగా చెప్పబడింది.
అలంపుర క్షేత్రానికి దక్షిణకాశీయని పేరు. వరుణ, అసి నదులు గంగా నదిలో సంగమించే చోట కాశీక్షేత్రం వున్నట్లుగానే, తుంగ - భద్ర నదులు కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో అలంపురం వుంది. కాశీ ఆలయం వరుణ - అసి నదుల మధ్య వున్నట్టుగానే అలంపురం ఆలయం కూడా వేదవతి - నాదవతి అనే నదుల మధ్య వుంది. కాశీలో వున్నట్లుగానే ఒకప్పుడు యిక్కడ 64 స్నానఘట్టాలు వుండేవట. అందుకే యిది దక్షిణ కాశిగా పేరొందింది.
ఈ క్షేత్రంలో తొమ్మిది శివాలయాలుండటం విశేషం. వీటికే నవబ్రహ్మ ఆలయాలు అని పేరు. చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాలు యించుమించుగా ఒకే వాస్తు నిర్మాణ శైలిలో వున్నాయి. స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, బాలబ్రహ్మ, అర్కఅబహ్మ, కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ అనే పేర్లతో ఈ ఆలయాలలో పరమేశుడు లింగ స్వరూపునిగా పూజలందుకుంటున్నాడు. ఈ నవబ్రహ్మ ఆలయాలలో బాల బ్రహ్మేశ్వరాలయం ప్రధాన ఆలయంగా చెప్పబడుతోంది.
ఇక్కడ స్థలపురాణంలో మొదట బ్రహ్మ యిక్కడ తపస్సుచేసినట్లు పేర్కొనబడింది. ఇంకా యిక్కడి బ్రహ్మేశ్వరుని సేవించిన వారికి బ్రహ్మపథం లభిస్తుందని కూడా స్థలపురాణం అంటోంది. జమదగ్ని, పరశురాముడు మొదలైన మహర్షులు యిక్కడ తపస్సు చేశారని చెబుతారు. ఎన్నో ఆలయాలతో, మరెంతో శిల్పసంపదతో అలరారే ఈ క్షేత్రం, ఎన్నో అరుదైన శిల్పాలతో కూడివుండి ఆలయ వాస్తు నిర్మాణ పద్ధతులకు కాణాచిగా నిలిచింది.
ఇక్కడి జోగుళాంబ అమ్మవారు యోగాంబ, యోగీశ్వరి, యోగినీశ్వరి, జోగాంబ, జోగీశ్వరి మొదలైన పేర్లతో పిలువబడింది. కాగా ఇటీవలికాలం వరకు జోగుళాంబకు ప్రత్యేకమైన ఆలయంలేదు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఆగ్నేయ మూలనున్న ఒక చిన్నగదిలో అమ్మవారు ప్రతిష్ఠితురాలై దర్శనమిచ్చేది. ఈ గదిలోని అమ్మవారిని భక్తులు నేరుగా కాక, గది ద్వారం పక్క నుండి తొంగి చూసి దర్శించుకోవలసి వచ్చేది.
అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాల నిర్మాణ శైలిలోనే, బాదామి చాళుక్యుల శైలిలో పూర్తిగా రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. మంచి అయితే చారిత్రకంగా లభించిన ఆధారాలను బట్టి జోగుళాంబకు ఒకప్పుడు ప్రత్యేకంగా ఆలయం వుండేదని, తరువాతి కాలంలో దుండగుల విధ్వంసానికిగురైన ఈ ఆలయంలోని అమ్మవారు సుమారు ఆంగ్ల శకం 12వ శతాబ్దంలో బ్రహ్మేశ్వర ఆలయంలోనికి చేర్చబడిందన భావించబడుతోంది. ఒకప్పుడు వుండిన జోగుళాంబ ఆలయ ప్రదేశాన్ని గుర్తించి, ఆ ప్రదేశంలోనే నూతన ఆలయం నిర్మించబడింది.
ప్రస్తుతం జోగుళాంబాదేవి అలంకరణలో శాంత మూర్తిగా దర్శనమిస్తున్నప్పటికీ, వాస్తవంగా ఈదేవి ఉగ్రస్వరూపిణి. ఈమె ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు ఆదిశంకరుల వారు ఒక ప్రక్రియను చేసారని కూడా చెబుతారు.
ఈ అమ్మవారు నాలుగు చేతులను కలిగివుండి, కుడివైపు పైచేతిలో కపాలాన్ని, క్రింది చేతిలో ఖడ్గాన్ని, ఎడమవైపు పైచేతిలో గొడ్డలిని, క్రింది చేతిలో పాన పాత్రను ధరించి వుంటుంది. ఈ దేవి కపాలమాలనే యజ్ఞోప వీతంగా ధరించి వుంటుంది. ఇంకా ఊర్ధ్వకేశాలతో, రౌద్రంగా కన్పించే పెద్ద కండ్లతో, పెద్ద కోరల తో, నోరు తెరచి, నాలుక బయటకు చాపినట్లుగా ఈమె రూపం వుంటుంది. ఈమె తలపై ఎడమవైపు గుడ్లగూబ, క్రింది భాగంలో పుర్రె, కుడివైపున బల్లి, బల్లికి కపాలానికి మధ్యన పాపిడి స్థానంలో తేలు వుంటుంది. ఈ దేవి ఆరాధన వలన యోగసిద్ధి కలుగుతందని, అందుకే ఎక్కువమంది సిద్ధపురుషులు ఈమెను ఆరాధించారని చెబుతారు.