శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

రామేశ్వర (తమిళనాడు)

రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వుంది. మనదేశ భూభాగం నుండి విడదీయబడి, బంగాళాఖాతం - హిందూమహా సముద్రం సంగమస్థానంలో వున్న ద్వీపమే రామేశ్వరం.

సముద్రతీరంలో, సముద్రంలోనే వున్నట్లుగా కనిపించే ఈ క్షేత్రం శ్రీలంకకు ఎంతో దగ్గరగా వుంది. సముద్రమట్టానికి కేవలం పది అడుగుల ఎత్తులో మాత్రమే ఈ క్షేత్రం ఉండటం విశేషం. శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠితుడైన ఈ స్వామిని రామేశ్వరుడని, రామనాథుడని, రామలింగేశ్వరుడని పలు పేర్లతో పిలుస్తారు. మన పురాణాలలో ఈ ప్రాంతం గంధమాదనంగా పిలువబడింది.

శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణగాథ చెప్పబడింది. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించిన తర్వాత సీతాదేవితో కలసి ఈ గంధమాదన పర్వతానికి వచ్చాడు. రావణుని చంపడంచేత తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపనివృత్తికై అగస్త్యుని సూచన మేరకు యిక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించదలచాడు శ్రీరాముడు. ప్రతిష్ఠకై శివలింగాన్ని తెచ్చేందుకై హను మంతుని కైలాసానికి పంపాడు. కానీ, హనుమంతుడు శివలింగాన్ని తెచ్చేంతలోపే ముహూర్తం సమీపిస్తుండటంతో సీతాదేవితో అక్కడి యిసుకను ప్రోగుచేయించి, సైకత లింగాన్ని రూపొందింపచేసి, ఆ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తయ్యే సమయానికి శివలింగాన్ని తెచ్చిన హనుమంతుడు అప్పటికే ప్రతిష్ఠ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. శ్రీరాముడు ఎంత ఓదార్చినప్పటికీ హనుమంతుడు కుదుట పడలేదు. అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి ఆనందాన్ని కలిగించేందుకై ప్రతిష్ఠించబడిన సైకతలింగాన్ని పెకిలించి, ఆ స్థానంలో హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని పునఃప్రతిష్ఠించమన్నాడు.

అయితే ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ శివలింగం యించుకైనా కదల్లేదు. శివలింగాన్ని పెకిలించే ప్రయత్నంలో హనుమంతుడు మూర్చపోయాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని మూర్ఛను పోగొట్టి, ఆ దగ్గరలోనే హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేశాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తెచ్చిన శివలింగం హనుమదీశ్వరుని గాను పేరొందాయి. హనుమదీశ్వర లింగాన్ని విశ్వేశ్వర లింగం, విశ్వలింగం అనికూడా పిలుస్తారు.