శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

సోమనాథక్షేత్రం ( గుజరాత్ )

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథక్షేత్రం మొదటగా చెప్పబడుతోంది. ఇచ్చట కొలువైన స్వామికి సోమనాథుడని పేరు. మన పురాణాలు ఈ క్షేత్రాన్ని ప్రభాసతీర్థంగా పేర్కొన్నాయి.

స్కాందపురాణాన్ని అనుసరించి చంద్రుని తపస్సు కారణంగా పరమశివుడు ఈ క్షేత్రంలో సోమనాథునిగా వెలశాడు. చంద్రునికి సోముడనే పేరుంది. నాథుడు అంటే రక్షకుడని అర్థం. చంద్రుడు శివుణ్ణి తన నాథునిగా భావించి యిక్కడ తపస్సు చేసాడు కాబట్టి ఈ జ్యోతిర్లింగం సోమనాథునిగా పేరొందింది.

సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తొమ్మిదిమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో దక్షప్రజాపతి ఒకడు. దక్షుడు తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని చంద్రునికిచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు మాత్రం అందరిలోను అందగత్తె అయిన రోహిణితో ఎక్కువ ప్రేమతో వుండేవాడు. దాంతో మిగిలిన వారంతా తమ బాధను తండ్రితో మొరపెట్టుకున్నారు. దక్షుడు భార్యలందరినీ సమానంగా చూడమని చంద్రునికి ఎన్నోవిధాలుగా నచ్చజెప్పాడు. అయినా చంద్రుని ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో కోపించిన దక్షుడు భయంకర మైన క్షయవ్యాధిగ్రస్తుడవు కమ్మని చంద్రుణ్ని శపించాడు.

ఈ శాపంతో చంద్రుని కళలు క్షీణించసాగాయి. చంద్రుడు కాంతిహీనుడయ్యాడు. లోకాలపై తన కాంతిని శీతలత్వాన్ని, ప్రసరింపజేసే శక్తిని కోల్పోయాడు.

చంద్రకాంతి లేకపోవడంతో లోకాలలో చీకట్లు అలుముకున్నాయి. ఓషధులు, చెట్లు నిస్తేజాలయ్యాయి.

యజ్ఞయాగాదులు లేకపోవడంతో దేవతలకు ఆహుతులు కరువయ్యాయి. ఈ ఉపద్రవం నుండి బయట పడేందుకు శివుని గురించి ప్రభాసక్షేత్రంలో తపస్సు చేయమని బ్రహ్మ దేవుడు చంద్రునికి సూచించాడు.

చంద్రుడు తన తపస్సుతో శివ సాక్షాత్కారాన్ని పొందాడు. పరమశివుని అనుగ్రహంతో చంద్రుడు వ్యాధినుండి విముక్తిని పొంది కృష్ణపక్షంలో ప్రతీరోజు చంద్రునికళ ఒక్కొక్కటి క్షీణించే విధంగాను, మళ్లీ తిరిగి శుక్లపక్షంలో అదేక్రమంలో ఒక్కొక్క కళ వృద్ధి పొందేటట్లు వరాన్ని పొందాడు.

దాంతో యథావిధిగా లోకాలపై తన కాంతిని ప్రసరింపజేశాడు చంద్రుడు. చంద్రుని చైతన్యంతో లోకాలన్నీ ఉత్తేజాన్ని పొందాయి. చివరకు చంద్రుని కోరికమేరకు ప్రభాసతీర్థంలో సోమనాథునిగా వెలశాడు పరమేశుడు.