శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

పిఠాపురం - పురుహూతికాదేవి

పిఠాపురం మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో వుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రం స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రంగానూ, మూడు గయలలో ఒకటైన పాదగయ క్షేత్రంగాను, పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీమాధవ క్షేత్రంగానూ, శ్రీపాదవల్లభుల జన్మస్థానమై దత్తక్షేత్రంగానూ పేరొందింది.

ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క పీఠభాగం పడినట్లుగా చెప్పబడుతోంది. అమ్మవారి పీఠభాగం పడటం చేతనే ఈ క్షేత్రం పిఠాపురం అయిందని స్థానిక కథనం. కాగా వివిధ కాలాలలో ఈ క్షేత్రం- పురుహూతికా నగరమని, పీఠికాపురమని, పిష్ఠపురం అని పలుపేర్లతో పిలవబడినట్లుగా సాహిత్య మరియు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. స్కాందపురాణంలోని భీమఖండంలోనూ, వాయుపురాణంలోనూ ఈ క్షేత్ర ప్రాశస్త్యం చెప్పబడింది. ఇంకా మోక్షాన్ని ప్రసాదించే నాలుగు క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటిగా పేర్కొనబడింది.

పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వరుడై స్వయం వ్యక్తంగా వెలసిన కారణంగా ఈ క్షేత్రానికి స్వయంభూ కుక్కుటేశ్వర క్షేత్రమనే పేరొచ్చింది. ఇక మన పితరులకు ముక్తిని కలిగించే గయాక్షేతాలు మనకు మూడుగా చెప్పబడ్డాయి. అవి - పాదగయ, నాభిగయ, శిరోగయ. వీటిలో పాదగయ పిఠాపురం కాగా, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ దగ్గర నాభిగయ, బీహార్ రాష్ట్రంలోని గయాక్షేత్రం శిరోగయగా చెప్పబడుతున్నాయి. ఈ మూడు గయాక్షేతాలు కూడా అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలు కావడం విశేషం. పిఠాపుర క్షేత్రంలో పురుహూతికాదేవి కొలువుతీరివుండగా, నాభిగయలో గిరిజాదేవి, శిరోగయలో మంగళగౌరి, కొలువుతీరి వున్నారు.

ఈ పిఠాపురక్షేతం పంచమాధవ క్షేత్రాలలో ఒకటి. వృతాసుర సంహారం చేసాక ఇంద్రుడు ఆ పాప పరిహారం కోసం అయిదుచోట్ల విష్ణు ప్రతిష్ఠలను చేసాడు. ఆ క్షేతాలే పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.

అవి... కాశి (బిందుమాధవుడు), ప్రయాగ (వేణు మాధవుడు), పిఠాపురం (కుంతిమాధవుడు), రామేశ్వరం (సేతుమాధవుడు), అనంత పద్మనాభం (సుందరమాధవుడు). దత్తాత్రేయస్వామి శ్రీపాదవల్లభునిగా ఈ పిఠాపురంలో జన్మించడంచేత యిది దత్తక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైంది.

కాగా ఈ క్షేత్ర స్థలపురాణం ప్రధానంగా గయాసురునితో ముడిపడివుంది. పూర్వం గయాసురుడనే రాక్షసరాజు తపస్సుచేత శివుని మెప్పించి, భూమండలంలోని అన్ని ప్రదేశాలకన్నా అతని శరీరం అత్యంత పవిత్రమైనదిగా వుండే వరాన్నిపొందాడు.

గయాసురుడు ధర్మవర్తనుడైనప్పటికీ, అతని అనుచరులు లోకాలను బాధిస్తూ, జనులను పీడించసాగారు. గయాసురుడు కూడా ఇంద్రుని జయించి, ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. దాంతో ఇంద్రుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తపస్సుచేసి, వారిని మెప్పించి, గయుణ్ని మట్టుపెట్టమని వారిని కోరాడు. దానికి అంగీకరించారు త్రిమూర్తులు. తరువాత త్రిమూర్తులు ప్రచ్ఛన్న వేషంలో గయుని వద్దకు బ్రాహ్మణ రూపాలతో వెళ్ళి వారు లోకరక్షణకై యాగాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారని, అందుకు సహక రించమని అతణ్ని కోరారు. అందుకు సంతోషించిన గయుడు యాగ నిర్వహణకై తన ప్రాణాలనైనా యిస్తానన్నాడు.

అప్పుడు వారు యజ్ఞ నిర్వహణకు అనువైన పవిత్ర స్థలం భూమండలం మీద ఎక్కడాలేదని, గయుని దేహమే తమ యజ్ఞనిర్వహణకు అనువైన స్థలమన్నారు. తన దేహాన్ని యజ్ఞవాటికగా వినియోగించుకునేందుకు అంగీకరించాడు గయుడు.

అంతేకాకుండా వారి యజ్ఞం పూర్తయ్యేందుకు ఏడు రోజులు పడుతుందని, యజ్ఞం పూర్తయ్యేంత వరకు కూడా గయాసురుడు దేహాన్ని కదిలించ కూడదని, ఒకవేళ మధ్యలో శరీరాన్ని కదిలిస్తే వారు గయుణ్ని సహకరించాల్సి వస్తుందనే షరతను విధించారు మాయా వేషంలో వున్న త్రిమూర్తులు. అందుకుకూడా గయుడు అంగీకరించడంతో యాగం ప్రారంభమయింది. గయుడు తన శరీరాన్ని పెద్దదిగా చేయడంతో దాని పైనే త్రిమూర్తులు యాగాన్ని ప్రారంభించారు. కోడికూత ఆధారంగా రోజులను లెక్కపెట్టుకుంటున్నాడు గయుడు. ఆరురోజుల యాగం పూర్తయింది.

ఏడవరోజున తెల్లవారకముందే అంటే అర్థరాత్రే శివుడు కుక్కుటంగా అంటే కోడిపుంజుగా మారి కూతపెట్టాడు. దాంతో ఏడవరోజు పూర్తయిందని తన దేహాన్ని కదిలించాడు గయుడు. యజ్ఞం భంగం అయిందనే నెపంతో గయాసురుణ్ని సంహరించాడు విష్ణుమూర్తి. ఆ సందర్భంలో గయుడి శరీరభాగాలు పడిన మూడు ప్రదేశాలు కూడా పుణ్యధామాలుగా వెలసాయి. అవే గయా క్షేత్రాలు కాగా ఈ సందర్భంలోనే పరమేశుడు పిఠాపురంలో కుక్కుటేశ్వరునిగా కొలువుతీరగా, అమ్మవారు పురుహూ తికాదేవిగా వెలిసింది.

పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే పురుహూతికా దేవి ఆలయం వుంది. ఆలయంలోని అమ్మవారు చక్కని నల్లరాతితో మలచబడి మనోహరంగా దర్శనమిస్తుంది. ఆలయంలోని ప్రాచీనమూర్తి స్థానంలో ప్రస్తుతమున్న నవీన మూర్తిని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. అమ్మవారు చతుర్భుజాలను కలిగివుండి, కుడివైపు చేతులలో దండము, మాదీఫలము, ఎడమవైపున డాలు, పానపాత్రను కలిగివుంటుంది.