శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

భీమశంకర్ (మహారాష్ట్ర)

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవది అయిన భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూనానగరానికి దాదాపుగా 122 కి.మీ దూరంలో భీమానదీతీరాన కొండశిఖరంపై వెలిసింది. ఇక్కడి క్షేత్రం కూడా భీమశంకర్ గానే పిలువబడుతోంది.

ఒకానొకప్పుడు ఈ ప్రాంతం ఢాకినీ అనే రాక్షసి ఏలు బడిలోవున్నందున మన పురాణాలు ఈ ప్రాంతాన్ని ఢాకినిగా పేర్కొన్నాయి. ఈ కేత్రంలో పరమశివుడు భీమాసురుడనే రాక్షసుని సంహరించి, భీమశంకరునిగా వెలశాడు.

ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావానికి సంబంధించిన కథ శివపురాణంలో కనిపిస్తుంది. త్రేతాయుగంలో భీమాసురుడనే బలవంతుడైన రాక్షసుడు తన తల్లి అయిన కర్కసితో కలసి నివస్తుండేవాడు. రావణుని సోదరుడైన కుంభకర్ణుడు ఈ భీమాసురుని తండ్రి. తన బాల్యంలోనే కుంభకర్ణుడు శ్రీరామునిచేత చంపబడ్డాడని తన యుక్తవయస్సులో తెలుసుకుంటాడు భీమాసురుడు. అప్పటి నుండి అతను విష్ణుమూర్తిపైన అతని భక్తులపైన పగను పెంచుకొని, విష్ణుమూర్తిని జయించేందుకై బ్రహ్మదేవునికోసం తపస్సుచేసి అంతులేని బలపరాక్రమాలను పొందుతాడు. ఆ వరగర్వంతో దండయాత్రలు చేస్తూ, అందులో భాగంగా కామరూపదేశంపై దండెత్తి ఆ దేశరాజైన సుదక్షుని తన చెరసాలలో బంధిస్తాడు. శివభక్తుడైన సుదక్షుణుడు కారాగారంలోనే పార్థివలింగాన్ని రూపొందించుకుని శివుని నియమ నిష్టలతో ఆరాధిస్తుంటాడు.

ఈ శివపూజలను సహించలేని భీమాసురుడు కారాగారంలోని పార్థివలింగపై కత్తినిదూస్తాడు. ఆ కత్తి శివలింగాన్ని స్పర్శించినంతనే శివలింగం నుండి పరమశివుడు ఉద్భవించి తన మూడవకన్నును తెరచి భీమాసురుని భస్మంచేస్తాడు. చివరకు దేవతలు, మునుల కోరిక మేరకు పరమ శివుడు ఇక్కడే జ్యోతి ర్లింగంగా వెలశాడు.