శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

మాహూర్యం - ఏకవీరాదేవి

మహారాష్ట్రలోని మాహూర్యం క్షేత్రంలో పరాశక్తి ఏకవీరాదేవి పేరుతో కొలువుతీరి పూజలందుకుంటోంది. మాహూర్యాన్నే ప్రస్తుతం ‘మాహోర్’ అని పిలుస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కుడిచేయి పడిందని చెప్పబడుతోంది. ఈ మాహూర్యం దత్తాత్రేయుని జన్మస్థలమని, యిక్కడి ఏకవీరాదేవిని దత్తాత్రేయుడు ఆరాధించాడని చెబుతారు.

ఇక్కడి స్థలపురాణం ప్రకారం పరశురాముడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ అంతమొందించాడు. ఆ పాప పరిహారం కోసం తీర్థయాత్రలుచేస్తూ, అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ తీర్థయాత్ర సందర్భంగా, ఈ మాహూర్యంలో పరశురాముడు యజ్ఞం చేస్తుండగా, యజ్ఞ సమయంలో పరశురాముని ఆశీర్వదించేందుకు ఆదిపరాశక్తి ఏకవీరాదేవి రూపంలో యిక్కడకు విచ్చేసి, ఈ క్షేత్రంలోనే కొలువుదీరినట్లుగా తెలుస్తోంది.

ఈ క్షేత్రానికి సంబంధించిన మరొక కథ కూడా వుంది. పూర్వం యిక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమం వుండేది. జమదగ్ని భార్య రేణుక మహాపతివ్రత. తన పాతివ్రత్య ప్రభావంతో ఆమె రోజూ నదీతీరంలో ఇసుకతో కుండను చేసి, ఆ కుండలో నీటిని నింపుకొని ఆశ్రమానికి వచ్చేది. ఆ నీటితోనే జమదగ్ని పూజాదికాలను నిర్వర్తించేవాడు.

ఒక రోజున రేణుక నదికి వచ్చేసరికి నదిలో ఒక గంధర్వుడు జలక్రీడలాడు తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన రేణుక మనస్సు కొంచెంచలించింది. మనస్సు చంచలమవ్వడంవలన ఆమె పాతివ్రత్య శక్తి సన్నగిల్లడంతో ఇసుకతో కుండను చేయలేకపోయింది రేణుక. దాంతో వట్టి చేతులతో ఆమె ఆశ్రమానికి తిరిగొచ్చింది. తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకొన్న జమ దగ్ని, తన నలుగురు కుమారులను పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు. వారెవ్వరూ తల్లిని సంహరించలేదు. అప్పుడు అయిదవ కుమారుడైన పరశురాముణ్ణి పిలిచి, తల్లిని, తల్లితోపాటు నలుగురు సోదరులనూ వధించమని ఆదేశించాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞను శిరసావహించి, వారందరి తలలను నరికాడు పరశు రాముడు.

అప్పుడు జమదగ్ని సంతోషించి, పరశురాముని ఏదైనా వరాన్ని కోరుకో మన్నాడు. పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించమని కోరడంతో వారందరూ పునరుజ్జీవితులయ్యారు. ఈ విధంగా పరశురాముడు తల్లి, సోదరుల తలలను నరికిన ప్రదేశమే మాహూర్యంగా చెప్పబడింది.

ఇక్కడి గర్భాలయంలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా అమ్మవారి తలమాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారికి మెడ, భుజాలు, చేతులు, కాళ్ళు యితర అవయవాలు ఏమీవుండవు. అమ్మవారి శిరోభాగానికే పూజాదికాలు నిర్వహిస్తారు. స్థానికులు అమ్మవారిని శ్రీమాతాదేవి అనికూడా పిలుస్తారు.