శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కామరూపాదేవి - హరిక్షేత్రం

అష్టాదశ శక్తిపీఠాల్లో పదమూడవ పీఠం... హరిక్షేత్రం. ఈ క్షేత్రానికి కామరూప క్షేత్రం అని కూడా పేరు. మన పురాణాలలో నరకాసురుడు పరిపాలించినట్లుగా చెప్పబడిన ప్రాగ్జ్యోతిషపురమే ఈ కామరూప ప్రాంతం. ప్రస్తుతం యిది నేటి అస్సాం రాష్ట్రంలో వుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారిని కామరూపాదేవి అని పిలుస్తారు. ఆమెకే కామాఖ్య అని కూడా పేరు. కామరూపాదేవి అనే పేరుకంటే కామాఖ్య అనే పేరే అమ్మవారికి ఎంతో ప్రసిద్ధం. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క యోనిభాగం పడిందని చెబుతారు. అస్సాం రాష్ట్ర రాజధాని అయిన గౌహతి నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతంపై ఈ క్షేత్రం వుంది. కాళికాపురాణంలో ఈ క్షేత్రానికి సంబంధించిన సమస్త విషయాలు వివరించబడ్డాయి. అష్టాదశ శక్తిపీఠాలలో తాంత్రిక సంబంధంగా ఎంతోప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ కామాఖ్యనే.

ఇక్కడి స్థలపురాణం ప్రకారం బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించే ముందు ఆది పరాశక్తిని ధ్యానించకుండానే అహంకారంతో జగత్తును సృష్టించేందుకు ఉపక్రమించాడట. అప్పుడు ఆదిపరాశక్తి అతని అజ్ఞానాన్ని పోగొట్టేందుకై, అతని అహంకారం నుంచి కేశి అనే రాక్షసుని సృష్టించింది. ఆ రాక్షసుడు బ్రహ్మనే చంపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువును శరణువేడాడు. ఆ ఆపద నుంచి గట్టెక్కేందుకు విష్ణువు యిచ్చిన సలహా మేరకు బ్రహ్మ పరాశక్తిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మకు పరాశక్తి ప్రత్యక్షమై, బ్రహ్మ అహంకారం నుండి పుట్టిన ఆ రాక్షసుని సంహరించింది. తరువాత బ్రహ్మ తపస్సు చేసిన స్థలంలో పరాశక్తి ఒక యోనిముద్రను సృష్టించి, ఆ యోనిముద్రను అర్చించి, సృష్టిని ప్రారంభించమని బ్రహ్మకు సూచించింది. ఆ విధంగా సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ. ఆ యోని ముద్రాంకితమైన ప్రదేశమే కామాఖ్య.

కాగా తరువాతి కాలంలో మన్మధుడు శివతపోభంగాన్ని చేసినప్పుడు తన ఫాలనేత్రాగ్నితో మన్మధుని భస్మం చేస్తాడు శివుడు. అప్పుడు రతీదేవి దుఃఖిస్తూ, మన్మధుని బ్రతికించమని శివుణ్ని వేడుకుంటుంది. దేవతలందరూ కూడా యిందుకు తాముకూడా బాధ్యులమేనని, యిందులో మన్మధుని తప్పేమీ లేదని, కాబట్టి మన్మధుని తిరిగి బ్రతికించమని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు మన్మధుని తిరిగి బ్రతికిస్తాడు. కానీ అతనికి ముందున్న సుందరరూపం ఉండదు. రతీమన్మధులు తిరిగి శివుని ప్రార్థించడంతో శివుడు కామాఖ్యరూపాన్ని పూజించి, యోని ముద్రాంకిత ప్రదేశంలో అమ్మవారికి ఆలయాన్ని కట్టించమని చెబుతాడు శివుడు. అప్పుడు విశ్వకర్మతో మన్మధుడే మొదటగా కామాఖ్య ఆలయాన్ని నిర్మించాడని చెప్పబడుతోంది. అయితే కాలక్రమంలో ఈ ఆలయం మరుగునపడి కాలగర్భంలో కలిసి పోయింది.

తరువాతి కాలంలో నిర్మించబడిన ప్రస్తుత కామాఖ్యఆలయం గర్బాలయం, అంతరాలయం, ముఖమండపం, మహామండపం, ప్రవేశ మండపాలతోకూడి, శిల్పసంపదతో అలరారుతోంది. ఈ ఆలయం ఆంగ్లశకం 12-13 శతాబ్దాలలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

గర్భాలయం అంతరాలయంకన్నా దాదాపు 18 అడుగుల లోతులో వుంటుంది. అయితే గర్భాలయంలో అమ్మవారి విగ్రహస్వరూపం వుండదు.

ఇక్కడ యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం (శిలారూపం) వుంటుంది. దీనికే యోనికుండం అనిపేరు. నిరంతరంగా ఎప్పుడూ ఆ భాగం నుండి నీరు ఊటలాగా స్రవిస్తూ వుంటుంది. గర్భాలయం ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉండటంతో యోని కుండం నుంచి స్రవించేనీరు దక్షిణానికి ప్రవహిస్తూ గర్భాలయంలోనే అంతరించి పోతుంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులు తలపై పోసుకుని తీర్థంగా స్వీకరిస్తారు.

ఈ ఆలయంలో ఎంతో విశేషం వుంది. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్ష సప్తమి మొదలు ఏకాదశి వరకు యోనికుండం నుంచి సహజంగా స్రవించే నీరు రంగుమారి ఎర్రగా వస్తాయి. ఈ సమయాన్ని అమ్మవారికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో మొదటి మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. నాలుగవ రోజున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాన్ని చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఐదవ రోజున ‘అంబువాసి యోగం’ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.